‘సూపర్ పవర్’ కిరణ్ బేడీ కి చుక్కెదురు

పుదుచ్చేరి లెఫ్టినెంట్ జనరల్ , మాజీ ఐపిఎస్ అధికారి కిరణ బేడీ అధికారాలకు మద్రాస్ హైకోర్టు చెక్ పెట్టింది.

చాలా రోజులుగా అక్కడ పాలనాధికారాల మీద ముఖ్యమంత్రి వి నారాయణ స్వామి (కాంగ్రెస్)కి, కిరణ్ బేడీకి గొడవ నడుస్తూ ఉంది.

ఎన్నికయిన ప్రభుత్వం ఉన్నా  పాలనాధికారాల్లోకి లెఫ్టినెంట్ గవర్నర్ చొరబడుతున్నారని ముఖ్యమంత్రి విమర్శిస్తూ ఉంటే, లె.గ అంటే రాజ్ భవన్ లో మూలన కూర్చోవడం కాదు,పరిపాలన ఎలా సాగుతున్నదో చూసే బాధ్యత కూడా ఉంటుందని ఆమె సూపర్ యాక్టివ్ అయిపోయారు.

చివరకు ఈ పంచాయతి మద్రాసు హైకోర్టు దాకా వెళ్లింది. ఈ రోజు కోర్టు లె.గ అధికారాలేమిటో వివరించి చెప్పింది.

 కేంద్రపాలితప్రాంతానికి ఒక ఎన్నికయిన ప్రభుత్వం ఉన్నపుడు రోజూవారి కార్యకాలాపాలలో లెఫ్టినెంట్ గవర్నర్ జోక్యం చేసుకోవడానికివీల్లేదని హైకోర్టు చెప్పింది.

‘సూపర్ పవర్’ కిరణ్ బేడీ హైపర్ యాక్టివ్ కార్యకలాపాలతో ఇబ్బంది పడుతున్న ముఖ్యమంత్రి నారాయణ స్వామికి ఇది పెద్ద రిలీఫ్.

‘పుదుచ్చేరి ముఖ్యమంత్రి అధికారాల్లో జోక్యంచేసుకునే హక్కు లెఫ్టినెంట్ గవర్నర్ కు లేదు. ప్రభుత్వం నుంచి తనకిష్టమొచ్చిన డాక్యుమెంటు తెప్పించుకునే అధికారం కూడా లెఫ్టినెంట్ గవర్నర్ కు లేదు,’అని హైకోర్టు ఒక్కసారిగా లె.గ విధులేమిటో, పరిమితులేమిటో స్పష్టం చేసింది.

పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతానికి ఎన్నికయిన మంత్రి మండలి ఉన్నా రోజు వారి పరిపాలనా వ్యవహారాలలో లెఫ్టినెంట్ గవర్నర్ జోక్యం చేసుకుంటున్నారని 2017లో ఎమ్మెల్యే లక్ష్మినారాయణ మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేశారు.

దీని మీద విచారణ అనంతరం, ఈ రోజు లెఫ్టినెంట్ గవర్నర్ అధికారాల మీద పరిమితి విధించి, రోజు వారి పాలనా వ్యవహారాలలో ఆమె జోక్యం తగదని హైకోర్టు పేర్కొంది.

హైకోర్టు తీర్పును ముఖ్యమంత్రి నారాయణ స్వామి స్వాగతించారు.

పుదుచ్చేరి పరిపాలన బాధ్యత ప్రజాస్వామికంగా ఎన్నికయిన ప్రభుత్వానిదని, హైకోర్టు ఈ విషయాన్ని స్సష్టం చేసిందని నారాయణ స్వామి వ్యాఖ్యానించారు.

అయితే,కిరణ్ బేడీ మాత్రం అస్పష్టంగా స్పందించారు. ‘ హైకోర్టు తీర్పును సాంతం చదివాక మాత్రమే తన నిర్ణయం వెల్లడిస్తాను,’అని అన్నారు.

లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ కేంద్రం ప్రోద్బలంతోనే పుదుచ్చేరి ప్రభుత్వ పాలనా రోజు వారి వ్యవహారాలలో జోక్యం చేసుకుంటున్నారని, ఇక్కడి ప్రభుత్వం పనిచేయకుండా ఆటంకం కలిగించి చిన్నాభిన్నం చేయాలనుకుంటున్నారని ముఖ్యమంత్రి నారాయణ స్వామి ఆరోపిస్తూ వస్తున్నారు.

‘పరిపాలనకు సంబంధించి ఆమెకు ఎలాంటి అధికారాలులేవు. ఆమె కార్యాలయం పోస్టాఫీసు వంటిదే. ప్రజాస్వామిక ప్రభుత్వం పంపే కాగితాల మీద సంతకాలు చేయడం తప్ప రొజు వారి వ్యవహారాలలో జోక్యం చేసుకోరాదు,’ అని ఆయన అన్నారు.

ఈ ఆరోపణను కిరణ్ బేడీ ఖండించారు. తాను రాజ్యంగంలో పొందుపరిచిన అంశాల ప్రకారమే పనిచేస్తున్నానని ఆమె అంటున్నారు.