మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కీలక వ్యాఖ్యలు

ఆయన దేశానికి రెండు సార్లు  ప్రధాన మంత్రిగా పని చేశారు. దేశం ఆర్ధిక రంగంలో క్లిష్ట పరిస్థితులలో ఉన్న సమయాన తన మేధాశక్తితో దేశ ఆర్ధిక వ్యవస్థకు రూపం పోశారు. ఆయన ఏ పదవి చేపట్టినా మచ్చ లేకుండా పని చేశారు. అటువంటి అపర మేధావికి ఆర్ధిక కష్టాలు వచ్చాయట. ఈ విషయాన్ని స్వయంగా ఆయన చెప్పడంతో దేశ ప్రజలంతా ఆశ్చర్య పోతున్నారు. కాంగ్రెస్ పార్టీలో రెండుసార్లు ప్రధాని పదవి చేపట్టిన వ్యక్తి వద్ద డబ్బులు లేవంటే అందరు అవాక్కవుతున్నారు. 

డాక్టర్ మన్మోహన్ సింగ్. భారత దేశానికి 2004 నుంచి 2014 వరకు దశాబ్ధ కాలం ప్రధాన మంత్రిగా సేవలందించారు. ఇప్పుడు ఆయన వద్ద కోర్టు ఖర్చులకు కూడా డబ్బులు లేవట.  ఈ విషయాన్ని ఏపీ మాజీ ఎంపీ, తన మిత్రుడు యలమంచిలి శివాజీతో ఆయనే స్వయంగా చెప్పారట. 

‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ పేరిట మన్మోహన్ బయోపిక్ తెరకెక్కగా, ఈ సినిమా ట్రైలర్ లో కొన్ని సన్నివేశాలు మన్మోహన్ ను కించపరుస్తున్నట్టు కనిపించడంతో వివాదం చెలరేగింది. ఇదే విషయమై కోర్టును ఆశ్రయించి పరువు నష్టం దావా వేయాలని మన్మోహన్ సింగ్ కు కొందరు సలహా ఇచ్చారట. ఇదే విషయాన్ని శివాజీ వద్ద ప్రస్తావించిన మన్మోహన్ సింగ్, కోర్టులో పోరాడేందుకు తన వద్ద డబ్బులు లేవని న్యాయవాదులకు భారీగా ఫీజులు చెల్లించలేనని అన్నారని సమాచారం. మీరు కూడా ఏ పార్టీలో చేరకుండా ఉన్నారని మీలాంటి మేధావులను ఉపయోగించుకునే వారు లేరని మన్మోహన్ శివాజీతో అన్నారట. దీంతో వారిద్దరు ఒకరినొకరు చూసుకొని నవ్వుకుంటూ అక్కడి నుంచి బయల్దేరి వెళ్లారు. దేశ ప్రధానిగా చేసిన వ్యక్తి డబ్బులు లేవనడం ఆయన నిజాయితీకి అద్దం పడుతుంది.