ఓ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం ఏకంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చాలా చాలా కష్టపడాల్సి రావడమంటే చిన్న విషయం కాదది.! 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ప్రస్తుత కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్ని ప్రధాని నరేంద్ర మోడీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
పోలింగ్ ముగిసింది.! భారీ పోలింగ్ నమోదయినట్లు తెలుస్తోంది. ఈ భారీ పోలింగ్ ఎవరికి అనుకూలం.? అన్నదానిపై రాజకీయ విశ్లేషకులు భిన్న వాదనలు వినిపిస్తున్నారు. ఎగ్జిట్ పోల్ ఫలితాల్ని బట్టి చూస్తే, కాంగ్రెస్ పార్టీకి క్లియర్ మెజార్టీ దక్కే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 120 వరకు సీట్లలో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరవేయబోతోందిట.
బీజేపీకి 90 సీట్లలోపే వచ్చే అవకాశాలున్నాయన్నది ఓ అంచనా. జేడీఎస్ ఎట్టి పరిస్థితుల్లోనూ 30 సీట్లకు మించి సాధించే అవకాశం లేదట. ఇతరులకు ఓ రెండు మూడు సీట్లు దక్కవచ్చునట.!
కర్నాటకలో అధికార పీఠం కైవసం చేసుకోవాలంటే 113 సీట్లు గెలవాల్సి వుంటుంది. ఆ లెక్కన, కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని మెజార్టీ వచ్చినట్లేనని ఎగ్జిట్ పోల్ అంచనాల ప్రకారం తెలుస్తోంది. కానీ, ఇవి జస్ట్ ఎగ్జిట్ పోల్ ‘అంచనాలు’ మాత్రమే.!
వాస్తవ ఫలితాల్లో కొంత మార్పులు చేర్పులు వుండేందుకు అవకాశాలు ఎక్కువే. జేడీఎస్‌ని ఇప్పటినుంచే దువ్వే పనిలో బీజేపీ వున్నట్లు కనిపిస్తోంది. జేడీఎస్‌ని ఓ కంట కనిపెడుతోంది కాంగ్రెస్ పార్టీ కూడా.!