చలన చిత్ర పరిశ్రమ పెద్ద తలకాయలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించడం అరుదు. తమకు ఉన్న పలుకుబడితో ఇలాంటి దాడులను నిలిపి వేయించుకునే శక్తి సామర్థ్యాలు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఉంది. శుక్రవారం బెంగళూరులో దీనికి భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. కన్నడ చిత్ర పరిశ్రమ బడా నిర్మాతలు, సూపర్‌స్టార్ల ఇళ్లపై ఏకకాలంలో ఐటీ అధికారులు దాడులు చేపట్టారు. వరుసబెట్టి తనిఖీలు నిర్వహిస్తున్నారు. బెంగళూరులో 50 ప్రాంతాల్లో, ఏకంగా 200 మందికి పైగా ఐటీ అధికారులు రెయిడ్ చేయడం శాండల్‌వుడ్ చరిత్రలో ఇదే అతి పెద్ద దాడిగా భావిస్తున్నారు. `ఈగ` ఫేమ్ సుదీప్, కేజీఎఫ్‌తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన యశ్ సహా పలువురు టాప్ హీరోల ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఉదయం 11 నుంచి సోదాలు కొనసాగుతున్నాయి.
నందమూరి బాలకృష్ణ ఆప్త మిత్రుడు, శాండల్‌వుడ్ స్టార్ హీరో, `కన్నడ కంఠీరవ` శివరాజ్‌కుమార్, ఆయన సోదరుడు పునీత్ రాజ్‌కుమార్, నిర్మాత `రాక్‌లైన్` వెంకటేష్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఈ దాడుల్లో 200 మందికిపైగా ఐటీ అధికారులు పాల్గొన్నారు. సుమారు 50 చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. ఐటీ దాడులు విషయం తెలియడంతో ఆయా నటుల అభిమానులు వారి ఇళ్ల వద్దకు బారులు తీరారు. సదాశివనగర్‌లో ఉన్న పునీత్ రాజ్‌కుమార్, రాక్‌లైన్ వెంకటేష్, కేజీఎఫ్ నిర్మాత విజయ్ కిరగందూర్ ఇళ్ల వద్ద పెద్ద సంఖ్యలో అభిమానులు చేరుకున్నారు. హఠాత్తుగా చోటు చేసుకున్న ఈ పరిణామాలతో శాండల్‌వుడ్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది.