రాహుల్-చంద్రబాబు మధ్య భారీ డీల్ ? అమరావతికి గెహ్లాట్ !

చూడబోతే అలాగే ఉంది. ఎందుకంటే, ముందస్తు ఎన్నికల్లో మహాకూటమి సీట్ల సర్దుబాటు కాలేదు. సోమవాం నుండి నామినేషన్ల ప్రక్రియ మొదలవుతున్నా ఇప్పటి వరకూ  సీట్ల సర్దబాటు ఒక కొల్లిక్కి రాలేదు.  పైగా కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాహుల్ గాంధి కోటరీలో సభ్యుడైన మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఈరోజు అమరావతిలో పర్యటిస్తుండటం ఆశ్చర్యంగా ఉంది. గెహ్లాట్ పర్యటనలో ఆశ్చర్యమేమిటంటే ఆయన అమరావతిలో పర్యటిస్తుండటం అసలు తెలంగాణా నేతలకే సమాకారం లేదు కాబట్టి. సీట్ల సర్దుబాటు నేపధ్యంలో గెహ్లాట్ అమరావతిలో చంద్రబాబుతో భేటీ అవబోతున్నారంటే ఏమనర్ధం ?

నిజానికి మహాకూటమిలో కాంగ్రెస్, టిడిపిలు మాత్రమే పెద్ద పార్టీలు, సిపిఐ, టిజెఎస్ లు చిన్న పార్టీలు కిందే లెక్క. తెలంగాణాలో టిడిపి పరిస్ధితేంటో అందరికీ తెలిసిందే. కాబట్టి కాంగ్రెస్ దే పెద్దన్న పాత్ర అని అనుకున్నారు. కానీ చిత్రంగా చంద్రబాబును కలవటానికి గెహ్లాట్ అమరావతికి వస్తుండటంతో మహాకూటమిపై అసలు పెత్తనం చంద్రబాబుదే అన్న అనుమానాలు మొదలయ్యాయి. కూటమిపై పెత్తనాన్ని కాంగ్రెస్ కు కాదని చంద్రబాబుకు అప్పగించటానికి కారణాలేంటి ?

ఏమిటంటే, మహాకూటమి అభ్యర్ధుల ఖర్చు మొత్తం చంద్రబాబే భరించటానికి ఒప్పుకున్నట్లు ప్రచారం అందరికీ తెలిసిందే. దానికి తగ్గట్లే తెలంగాణాలో పట్టుబడుతున్న డబ్బుల్లో ఎక్కువ భాగం టిడిపి నేతలదే కావటంతో అనుమానాలు బలపడుతున్నాయి. అదే సమయంలో కెసియార్ ను ఓడించటానికి అవసరమైన వ్యూహాలు రచించటం, అమలు చేయటంలో చంద్రబాబు ముందు కాంగ్రెస్ నేతలు తేలిపోతారనటంలో సందేహం లేదు. కాంగ్రెస్ అంటేనే ఎన్ని గ్రూపులు, ఎన్ని రాజకీయాలో అందరికీ తెలిసిందే. ఈ పరిస్ధితుల్లో కెసియార్ ను ఓడించటం కాంగ్రెస్ నేతల వల్ల కానిపనే. 

అందుకే పెత్తనం మొత్తాన్ని చంద్రబాబు మీద పెట్టాలని ఏఐసిసి అధ్యక్షుడు రాహూల్ గాంధి నిర్ణయించారట. పొత్తుల్లో రాహూల్–చంద్రబాబు మధ్య ఇది కూడా కీలక ఒప్పందమని ఇఫుడు ప్రచారం జరుగుతోంది. చంద్రబాబును నమ్ముకుంటేనే తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలదని రాహూల్ బాగా నమ్మకంతో ఉన్నారట. అందుకే నిధుల పంపిణీ, ప్రచార బాధ్యతలు, పోలింగ్ బూత్ ల దగ్గర బాధ్యతలు అన్నింటినీ మహాకూటమి తరపున చంద్రబాబే చూసుకోనున్నట్లు సమాచారం. ఎలాగూ బిజెపి యేతర పార్టీలను ఏకం చేయటానికి చంద్రబాబు కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారు.

నిజానికి అంత ఓపిక కాంగ్రెస్ నేతల్లో ఎవరికీ లేదు. బిజెపియేతర పార్టీల్లో కాంగ్రెస్ దే పెద్ద పార్టీ అయినా బాధ్యతలు మొత్తం రాహూల్ చంద్రబాబుకే అప్పగించారట. అంత పెద్ద బాధ్యతలే చంద్రబాబుకు అప్పగించినపుడు మహాకూటమిని గెలిపించే బాధ్యతను ఇవ్వటంలో ఆశ్చర్యమేముంది ? అందుకే గెహ్లాట్ కూడా అమరావతిలో చంద్రబాబుతో భేటీ అవ్వబోతున్నారు. మరి చూద్దాం ఏం జరుగుతుందో ?