గతంలో కూడా ఆస్కార్ రేసులో మన భారతీయ సినిమాలు నిలబడ్డాయి. అయితే, అవి చాలా అరుదైన సందర్భాలు. పైగా, ఒకటీ అరా సినిమాలే వెళ్ళేవి ఆస్కార్ రేసులోకి. కానీ, ఇప్పుడు సీన్ మారింది. ‘ఆర్ఆర్ఆర్’ సహా, ‘కాంతార’ సినిమా కూడా ఆస్కార్ రేసులోకి క్వాలిఫై అయ్యింది. ‘విక్రాంత్ రోణ’ సినిమా కూడా వెళ్ళింది. మరికొన్ని సినిమాలూ వున్నాయి రేసులో.
వారెవ్వా.! ఇది కదా అసలు కిక్కు.. అనుకుంటున్నాడు సగటు భారతీయ సినీ అభిమాని. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి ఆస్కార్ వస్తే, ఆ ఆస్కార్‌ని టచ్ చేసే అవకాశం తనకివ్వమంటూ బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్, టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ని సోషల్ మీడియా వేదికగా అడిగాడు.
తెలుగు సినిమా, కన్నడ సినిమా.. ఈ రెండు పరిశ్రమల నుంచి ఏకంగా మూడు సినిమాలు ఆస్కార్ రేసులోకి వెళ్ళాయి. మరికొన్ని సినిమాలూ ఇండియన్ సినిమా నుంచి ఆస్కార్ రేసులో నిలబడ్డాయి. అయితే, ఇవి ఆస్కార్ రేసుకి సంబంధించి క్వాలిఫై అయినవి మాత్రమే. ఏ సినిమాని.. కాదు కాదు ఎన్ని సినిమాల్ని ఆస్కార్ వరిస్తుందన్నది ముందు ముందు తేలుతుంది.
ఈసారి ఆస్కార్ కోసం ఇండియన్ సినిమా నుంచి అడుగు బలంగా పడింది. ఎవరికి ఆస్కార్ వచ్చినా, అది ఇండియన్ సినిమాకి వచ్చినట్లే. ఒకటి కాదు, రెండు కాదు.. అంతకు మించి ఆస్కార్ పురస్కారాలు ఇండియన్ సినిమాని వరిస్తే.! వరిస్తే ఏంటి.. వరించాలని కోరుకుందాం.