ఓ అందమైన అమ్మాయి. ఒకే ఒక్క యువతి. అందమైన చీరకట్టు, అంతకంటే అందమైన చిరునవ్వుతో మన ఆర్మీ జవాన్లను పడేసింది. చిత్తు చేసింది. ఆమె విసిరిన `హనీ ట్రాప్`లో ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా 50 మంది జవాన్లు చిక్కుకున్నారు. ఇప్పుడు వారందర్నీ సైనికాధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆ యువతి అసలు పేరేంటో గానీ, ఫేస్‌బుక్‌లో ఆమె అకౌంట్ ప్రకారం.. అనికా చోప్రా.
జునాగఢ్‌కు చెందిన యువతిగా తన వివరాలను అందులో పొందుపరిచారు. ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్నట్లు నకిలీ ఖాతాను సృష్టించారు. దాని ద్వారా మనదేశ జవాన్లకు ఎర వేసిందామె. వారి నుంచి కీలకమైన సమాచారాన్ని రాబట్టుకుంది. ప్రత్యేకించి- సోమ్‌వీర్ సింగ్ అనే జవాను ఆమెకు విలువైన, కీలకమైన సమాచారాన్ని చేరవేసినట్టు చెబుతున్నారు. దీనిపై అనుమానాలు వ్యక్తం కావడంతో సైనికాధికారులు ఆరా తీశారు.
దీనితో అనికా చోప్రా భారతీయురాలు కాదని, పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ ప్రతినిధి అని తేలింది. 2016 నుంచీ సోమ్‌వీర్ సింగ్ ఆ యువతితో సోషల్ మీడియా ద్వారా టచ్‌లో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ మూడేళ్ల కాలంలో విలువైన ఆర్మీకి సంబంధించిన విలువైన సమాచారాన్ని సోమ్‌వీర్ ఆమెకు వెల్లడించినట్లు తెలుస్తోంది. సోమ్‌వీర్‌కు పెళ్లి ఎర వేసినట్లు కూడా వెల్లడైంది.
అప్పటికే అతనికి పెళ్లయినప్పటికీ.. విడాకులు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చినట్లు చెబుతున్నారు. కొద్ది రోజులుగా సోమ్‌వీర్ ప్రవర్తనను గమనించిన తోటి జవాన్లు అతని ప్రవర్తనపై అధికారులకు సమాచారమిచ్చారు. దీనితో వారు సోమ్‌వీర్ ఫోన్‌కాల్స్, సామాజిక మాధ్యమాలపై నిఘా ఉంచారు.
అనికా చోప్రా, వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణను గురించి తెలుసుకున్నారు. భారత మిలిటరీకి సంబంధించి ఎంతో విలువైన సమాచారం, ఫొటోలు సోమ్‌వీర్ ఆమెకు పంపినట్లు గుర్తించారు. వెంటనే జవానును అదుపులోకి తీసుకున్నారు. దీనిపై విచారణ జరపగా ఈమె సోమ్‌వీర్‌నే కాకుండా వివిధ స్థావరాల్లో ఉన్న సుమారు 50 మంది జవాన్లకు వల విసిరిందని తేలింది.