భారతదేశాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసిన సంఘటన మణిపూర్ లో వెలుగు చూసిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మణిపూర్ అల్లర్లతో ప్రపంచ వ్యాప్తంగా ఒక్కసారిగా భారతదేశంలో జాతులు, కులాలు, మతాల మధ్య వైషమ్యాలపై చర్చ జరిగిందని అంటున్నరు. ఈ నేపథ్యంలో తాజాగా మణిపూర్ లో సినిమా ప్రదర్శన జరిగింది.
గత మూడు నెలలుగా ఉక్కిరిబిక్కిరైపోతున్న మణిపూర్ లో జరుగుతున్న అల్లర్ల సంగతి తెలిసిందే. కొంతమంది మనుషుల మూర్ఖత్వాలు, మరికొంతమంది నాయకుల చేతకాని తనాలు, ఇంకొంతమంది రాజకీయ నాయకుల స్వార్థ ప్రయోజనాలు వెరసి… మణిపూర్ తగలబడిపోయింది. ఈ క్రమంలో పార్లమెంటులో మోడీ సర్కార్ ని విపక్షాలు ఉతికి ఆరేశాయి.
ఇదే సమయంలో సుప్రీంకోర్టు మణిపూర్ ఘటనపై కీలక వ్యాఖ్యలు చేసింది. దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సృహలోకి వచ్చినట్లున్నాయి! ఫలితంగా ప్రస్తుతం అక్కడ పరిస్థితులు కొద్ది కొద్దిగా చక్కబడుతున్నాయి. ఇందులో భాగంగా… ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు, కాలేజీలు ప్రారంభం అయ్యాయి
ఇదే సమయంలో.. రాష్ట్రంలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులను సైతం తిప్పుతోంది. ఈ క్రమంలో 23 ఏళ్ల తరువాత రాష్ట్రంలో హిందీ సినిమా ప్రదర్శనను చేపట్టారు. 2000 సంవత్సరంలో రాష్ట్రంలో హిందీ సినిమా ప్రదర్శించవద్దని మైతీ ఉగ్రవాద సంస్థ హెచ్చరించడంతో బంద్ అయిన హిందీ సినిమాల ప్రదర్శన.. 23 ఏళ్ల తరువాత మంగళవారం తిరిగి ప్రారంభం అయింది.
2000 సంవత్సరంలో హిందీ సినిమా ప్రదర్శించవద్దని మైతీ ఉగ్రవాద సంస్థ హెచ్చరించడంతో అక్కడ బాలీవుడ్ సినిమాలు ప్రదర్శన ఆగిపోయింది. మణిపూర్ లో 1998లో చివరిగా ప్రదర్శితమైన సినిమా కుచ్ కుచ్ హోతా హై. ఆ తరువాత రాష్ట్రంలో హిందీ సినిమాల ప్రదర్శన చేయరాదని నిషేధం విధించారు.
అయితే 23 ఏళ్ల తర్వాత మణిపూర్ హింసాకాండలో తీవ్రంగా ప్రభావితమైన చురాచందాపూర్ జిల్లాలో హిందీ సినిమాను ప్రదర్శించారు. ఇది ఇంఫాల్ కు 63 కి.మీ.దూరంలో ఉంది. ఇక్కడ ఓపెన్ ఎయిర్ థియేటర్ లో విక్కీ కౌశల్ నటించిన “ఉరి – ద సర్జికల్ స్ట్రైక్” చిత్రాన్ని ప్రదర్శించగా పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు హాజరయ్యారు.
దీంతో పరిస్థితులు మరింత కుదుటపడుతున్నాయని చెప్పడానికి ఇదొక ఉదాహరణ అని అంటున్నారు. వీలైనంత త్వరగా నార్మల్ పరిస్థితులు రావాలని కోరుకుంటున్నారు. ఇదే సమయంలో బీజేపీ ప్రభుత్వం చేతకాని తనం మరిచిపోయేది కాదనే కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం!