ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎస్పీ-బీఎస్పీ పొత్తు అంశంపై ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ నోరు విప్పింది. ఎస్పీ-బీఎస్పీ పొత్తు వల్ల తమకు వచ్చిన నష్టమేమీ లేదని ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు గులామ్ నబీ ఆజాద్ స్పష్టం చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉన్న 80 లోక్‌సభ స్థానాల్లో తాము పోటీ చేస్తామని వెల్లడించారు. ఆదివారం న్యూఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. భావసారూప్యం గల సెక్యులర్ పార్టీలు తమతో కలిసి వస్తే.. సీట్లను సర్దుబాటు చేసుకుంటామని అన్నారు.
అలాంటి పార్టీలకు తలుపులు తెరిచే ఉంటాయని చెప్పారు. బీజేపీని ఓడించడమే తమ పార్టీ ఏకైక లక్ష్యమని ఆజాద్ అన్నారు. 2009 లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీకి వచ్చిన సీట్లకు రెండింతలు ఎక్కువగా సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఉత్తర్‌ప్రదేశ్‌లో 21 స్థానాల్లో విజయం సాధించింది. ఈ సంఖ్యను రెట్టింపు చేసుకుంటామని ఆజాద్ అంటున్నారు. రాష్ట్రీయ లోక్‌దళ్‌తో పొత్తు విషయంపై ఇప్పుడే ఏమీ మాట్లాడలేమని చెప్పారు.