పిల్లలు పుట్టినప్పటి నుంచే వారిని ఏ స్కూల్లో చదివించాలి, ఏ స్కూల్ బాగుంటుంది అనే చర్చ తల్లిదండ్రుల్లో జరుగుతోంది. తమకంటే తమ పిల్లలు బాగా చదవాలని ఎంత ఖర్చు అయినా సరే అని వారు నిర్ణయించుకుంటున్నారు. అటువంటిది ఓ కలెక్టరమ్మ తన కూతురును సామాన్యుల పిల్లలలాగా అంగన్ వాడీ పాఠశాలలో చేర్పించి ఇప్పుడు అందరితో శభాష్ అనిపించుకుంటోంది.
తమిళనాడులోని తిరునల్ వెలి జిల్లా కలెక్టర్ గా శిల్పా ప్రభాకర్ సతీష్ పని చేస్తున్నారు. ఆమెకు ఒక కూతురు ఉంది. తన కూతురును కార్పొరేట్ ప్లే స్కూల్ కో పంపించకుండా అంగన్ వాడీ పాఠశాలలో జాయిన్ చేశారు. దీంతో అంతా ఆశ్చర్య పోయారు. కలెక్టర్ తన బిడ్డను పెద్ద పెద్ద పాఠశాలలో జాయిన్ చేయకుండా పేదవారిలా అంగన్ వాడీ పాఠశాలలో జాయిన్ చేశారెందుకని పలువురు ప్రశ్నించారు. అయితే దీనిపై కలెక్టర్ శిల్ప స్పందించారు.
కలెక్టర్ శిల్ప ఏమన్నారంటే… తన మాటల్లో
‘‘ఏమీ అనుకోవద్దు. మేం కర్ణాటక వాసులం. అయితే నా కూతురు అంగన్‌వాడీలో చిన్నప్పటి నుంచే తమిళ్ నేర్చుకుంటుండటం చాలా ఆనందంగా ఉంది. నా కూతురు అన్ని రకాల సమూహాల ప్రజలతో కలిసి మమేకం కావాలి. వారి నుంచి ఎంతో నేర్చుకోవాలి’’ అని ఆమె అన్నారు.
ఈ అంగన్ వాడీ కేంద్రం కలెక్టరేట్ కు సమీపంలోనే ఉంది. అన్ని వసతులతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కలెక్టర్ తన కూతురును అంగన్ వాడీ పాఠశాలలో నేర్పించారని సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అంతే శిల్ప ఎంతో మంది హృదయాలను గెలుచుకున్నారని కలెక్టరమ్మను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.