ఆ ప్రాంతానికి జగన్ న్యాయం చేస్తారా.. సీమ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తారా?

YS Jagan

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పని చేసిన ముఖ్యమంత్రులలో ఎక్కువమంది ముఖ్యమంత్రులు రాయలసీమకు చెందిన ముఖ్యమంత్రులే కావడం గమనార్హం. అయితే ఈ ముఖ్యమంత్రుల వల్ల రాయలసీమకు పెద్దగా ప్రయోజనం చేకూరలేదనే కామెంట్లు చాలా సంవత్సరాల నుంచి వినిపిస్తున్నాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాత్రమే రాయలసీమ రైతులకు ప్రయోజనం చేకూరేలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

గాలేరు-న‌గ‌రి, హంద్రీ-నీవా ప్రాజెక్ట్ లు వేగంగా పూర్తైతే రాయలసీమలోని బీడు భూములలో సైతం పంటలు పండించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయని చెప్పవచ్చు. ఈ ప్రాజెక్ట్ ల పరిధిలో పొలాలకు కాలువలు తీసి సాగునీటిని అందించాల్సి ఉంది. జగన్ 2019 ఎన్నికలకు ముందు వైసీపీ అధికారంలోకి వస్తే ప్రాజెక్ట్ లను వేగంగా పూర్తి చేసి రైతులకు ప్రయోజనం కలిగేలా చేస్తానని చెప్పారు.

2019 ఎన్నికల్లో రాయలసీమలో 52 నియోజకవర్గాలలో 49 నియోజకవర్గాల్లో వైసీపీ విజయం సాధిస్తే 3 స్థానాలలో మాత్రం టీడీపీ విజయం సాధించడం గమనార్హం. 2014 ఎన్నికల్లో సైతం రాయలసీమలో వైసీపీకి అనుకూలంగా ఫలితాలు వచ్చాయి. సీమ వాసి అయిన జగన్ రాయలసీమ అభివృద్ధి కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

పెండింగ్ లో ఉన్న ప్రాజెక్ట్ ల పనులను జగన్ వేగంగా పూర్తి చేయాలని రాయలసీమ అభివృద్ధి కోసం జగన్ కీలక నిర్ణయాలు తీసుకోవాలని సీమవాసులు కోరుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం సైతం ఏపీలోని తెలుగు గంగ‌, గాలేరు-న‌గ‌రి, హంద్రీ-నీవా, వెలిగొండ‌ ప్రాజెక్ట్ లకు అనుమతి అవసరం లేదని స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ లను త్వరగా పూర్తి చేస్తే మంచిదని చెప్పవచ్చు. కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాలలోని మెజారిటీ కుటుంబాలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నాయనే సంగతి తెలిసిందే.