బీజేపీ నీచ రాజకీయాలకు బలిపశువు కాబోతున్నది మెట్రో మాన్

బీజేపీ

BJP's Evil politics becoming Metro Man as Victim

తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి కౌటిల్య రాజకీయాలను ఒకసారి గుర్తు చేసుకోండి….తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, మొత్తం రాజ్యసభ సభ్యులను, లేదా ఎమ్మెల్సీలను గెలిపించుకునే అవకాశం ఉన్నప్పుడు ఆయనకు సుజనా చౌదరి, సి ఎం రమేష్, టిజి వెంకటేష్ లాంటి పారిశ్రామికవేత్తలు, వందలకోట్ల అధిపతులు మాత్రమే కనిపిస్తారు. పార్టీ అధికారంలో లేనపుడు, ఒక్కరిని కూడా గెలిపించుకునే ఛాన్స్ లేనపుడు వర్ల రామయ్య లాంటి పేద దళిత నాయకులు గుర్తుకొస్తారు! అలాగే సొంత రాష్ట్రంలో గెలిచే అవకాశం ఉన్న సమయంలో బంధువులు ఎవ్వరూ గుర్తుకురారు. పొరుగు రాష్ట్రంలో, అసలు తమ పార్టీ ఉనికి కూడా లేని రాష్ట్రంలో, కచ్చితంగా గెలిచే అవకాశమే లేనపుడు చుండ్రు సుహాసిని లాంటి వారు గుర్తుకొస్తారు. అవసరానికి వాడుకోవడం ఆ తరువాత వారిని కరివేపాకు కన్నా హీనంగా తీసి అవతల పారేయడం ఆయనకు మాత్రమే తెలిసిన రాజకీయ తంత్రం.

వయసు ముదిరందని వంచన అయితే చంద్రబాబు సావాసదోషం వల్లనో ఏమో కానీ, ప్రధానమంత్రి మోదీ గారు కూడా అవే లక్షణాలను అందిపుచ్చుకున్నారు. తమ పార్టీకి విత్తనాలు వేసి, ఎరువులు వేసి, నీరుపోసి పెంచి, ఒక మహావృక్షంగా తయారు చేసిన మహా నాయకులు లాల్ కృష్ణ ఆడ్వాణీ, మురళీ మనోహర్ జోషి, యశ్వంత్ సిన్హా లాంటి సీనియర్ నాయకులను వయసు పేరుతొ లాఘవంగా తప్పించేశారు. డెబ్బై అయిదు దాటిన వారికి పదవులు ఇవ్వకూడదని విధాన నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకున్నారు. రాజకీయాల్లోకి యువతరం ప్రవేశించాలని అభిలషించే మాబోటివారు కురువృద్ధులను పక్కన పెట్టడాన్ని జీర్ణించుకోలేక పోయినప్పటికీ యువరక్తం ఆలోచనలు అభ్యుదయభావాలతో ఉంటాయి కదా అని మోడీ గారి నిర్ణయాన్ని స్వాగతించాము.

అస్మదీయులకు మినహాయింపు అయితే ఆ తరువాత కొన్నాళ్లకే మోడీగారు తమ నిర్ణయాన్ని తామే ఉల్లంఘించారు. డెబ్బై అయిదు దాటినప్పటికీ యెడియూరప్పను కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రతిష్టించారు. ఎందుకంటే ఆయన సామాజికవర్గానికి కర్ణాటకలో అంతులేని బలం ఉన్నదట! ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యగల శక్తిసామర్ధ్యాలు ఆయనకు మాత్రమే ఉన్నాయట. అనగా ఇక్కడ పార్టీ తీసుకున్న విధాన నిర్ణయానికి సడలింపులు ఉన్నాయని మనం అర్ధం చేసుకోవాలేమో!

బీజేపీ వలలో చిక్కిన అమాయక మత్స్యం తాజాగా బీజేపీ తీసుకున్న ఒక నిర్ణయం ఆశ్చర్యం కలిగించేదే. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా శ్రీధరన్ ను బీజేపీ ఎంపిక చేసింది. ఆయన్ను ఎంపిక చెయ్యడంలో ఏమాత్రం తప్పు లేదు. శ్రీధరన్ అత్యంత నిజాయితీపరుడు. గొప్ప మేధావి. భారతదేశానికి మెట్రో రైలును పరిచయం చేసిన ఘనకీర్తి ఆయనది. చంద్రబాబు హయాంలో విజయవాడలో కూడా మెట్రో ఏర్పాటు చెయ్యాలని ప్రయత్నించినపుడు చంద్రబాబుతో లెక్కల అంచనాల్లో ఏదో అవినీతి జరుగుతున్నదని ఆగ్రహించి ఆ ప్రాజెక్టును వదులుకుని వెళ్లిపోయారు ఆయన. దేశానికి అలాంటి నీతిపరులు అవసరమే.

శ్రీధరన్ కు టోపీ అయితే బీజేపీ వారు నిర్ణయించుకున్న వయోపరిమితి విషయం ఏమిటి? శ్రీధరన్ వయసు ఎనభై ఎనిమిది సంవత్సరాలు. ఎల్కే అద్వానీ కన్నా కేవలం నాలుగేళ్లు చిన్నవారు. బీజేపీ వారు నిర్ణయించుకున్న వయోపరిమితిని దాటి పదమూడేళ్లు అయింది. పైగా ఆయన రాజకీయనాయకుడు కాదు. ఒక అధికారి మాత్రమే. అలాంటి వ్యక్తిని కేరళ ఎన్నికల్లో బలిపశువును చెయ్యాలని బీజేపీ నిర్ణయించింది. కేరళలో బీజేపీ గెలిచే అవకాశం లేనేలేదని అందరికీ తెలుసు. ప్రస్తుత ముఖ్యమంత్రి విజయన్ మళ్ళీ గెలుస్తారని సర్వేలు చెబుతున్నాయి. అసలు అక్కడ బీజేపీ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలిస్తేనే గొప్ప విశేషం. అలాంటి చోట ఏకంగా మా సీఎం అభ్యర్థి అని శ్రీధరన్ పేరు ప్రకటించడం అంటే ఆయనకు ఈ వయసులో మానసికవేదనను మిగిల్చడమే కదా!

శ్రీధరన్ పట్ల బీజేపీవారికి అంత ఆపేక్ష కారిపోతుంటే ఆయనకు రాజ్యసభ సభ్యత్వం ఇప్పించి కేంద్ర మంత్రివర్గంలో రైల్వే శాఖను ఇవ్వొచ్చు కదా? ఆయనను ఆ రకంగా గౌరవించవచ్చు కదా? ఆయన సేవలను ఆ రకంగా వినియోగించవచ్చు కదా! ఆమ్మో…అలా చేస్తే బ్యాంకుల రుణాలు ఎగవేసే ఘరానాదొంగలు ఏమైపోవాలి?

ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ
విశ్లేషకులు