మోదీ నియోజకవర్గంలోనే అలా జరిగిందంటే బీజేపీకి బ్యాడ్ టైమ్ మొదలైనట్టే ?

Modi to increase Petrol Charges
బీజేపీ ఎప్పటికప్పుడు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో తమ సత్తాను నిరూపించుకుంటూనే ఉంది.  ఇటీవల జరిగిన పలు ఎన్నికల్లో బీజేపీ విజయబావుటా  ఎగురవేసింది.  బీహార్ ఎన్నికల్లో అయితే ఊహించని రీతిలో పుంజుకుని మరోసారి అధికారాన్ని నిలబెట్టుకుంది.  ఆ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఏకంగా 125 స్థానాలు పోందింది.  ఇంకా తాజాగా తెలంగాణలోని దుబ్బాక ఉప ఎన్నికలో గెలవడం, గ్రేటర్  హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 48 సీట్లు సాధించడంతో ఆ పార్టీ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.  ఇలా వరుస ఎన్నికల్లో దూసుకుపోతున్న ఆ పార్టీకి తాజగా పెద్ద దెబ్బే తగిలింది.  అది కూడ ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ  ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి  నియోజకవర్గంలో కావడం సర్వత్రా చర్చనీయాంశమైంది.   
 
BJP lost two MLC seats in Modi's Varanasi
BJP lost two MLC seats in Modi’s Varanasi
ఇటీవల యూపీలో ఖాళీ అయినా 11 ఎమ్మెల్సీ స్థానాలకు తాజాగా ఎన్నికలు జరిగాయి.  అందులో 5 పట్టభద్రుల నియోజకవర్గాలు కాగా, ఆరు ఉపాధ్యాయుల నియోజకవర్గాలు ఉన్నాయి.  వీటిలో ఈ 11 స్థానాల్లో వారణాసి పరిధిలో రెండు స్థానాలు ఉన్నాయి.  అందులో ఒకటి ఉపాధ్యాయుల నియోజకవర్గం కాగా, మరొకటి పట్టభద్రుల నియోజకవర్గం.  ప్రధాని ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం కాబట్టి ఎన్నిక ఏదైనా బీజేపీ గెలవడం పరిపాటిగా ఉండాలి.  మొన్నటివరకు అలాగే ఉంటూ వచ్చింది.  కానీ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి కమలం పార్టీని  డైలమాలో పడేసింది.  ఈ రెండు నియోజకవర్గాల్లోనూ సమాజ్‌ వాదీ పార్టీ గెలుపొందింది.  పట్టభద్రుల నియోజకవర్గం నుంచి సమాజ్‌వాదీ అభ్యర్థి అశుతోశ్ సిన్హా గెలుపొందగా, ఉపాధ్యాయుల నియోజకవర్గం నుంచి లాల్‌బిహారీ యాదవ్ నెగ్గారు.  
 
గత పదేళ్లుగా ఈ రెండు స్థానాల్లోనూ బీజేపీ అభ్యర్థులే గెలుస్తూ వచ్చారు.  కానీ ఈసారి అనూహ్యంగా బీజేపీ మట్టికరిచింది.  అధికారంలో ఉన్న యూపీలో శాసన మండలిలో బలం పెంచుకోవాలని చూస్తున్న తరుణంలో ఇలా మోదీ  నియోజకవర్గంలో ఉన్న రెండు స్థానాలను కోల్పోవడం ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బే అనాలి.  మొత్తం 11 స్థానాల్లో బీజేపీ నాలుగు గెలవగా సమాజ్ వాదీ పార్టీ మూడు స్థానాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులు రెండు చోట్ల గెలిచారు.  ఇంకా రెండు స్థానాల్లో ఫలితం రావాల్సి ఉంది.  ఈ రెండు చోట్లా బీజేపీ అభ్యర్థులే లీడింగ్లో ఉన్నారు.  మొత్తానికి 11 స్థానాల్లో ఎక్కువ బీజేపీ వశమే అయినప్పటికీ వారణాసిలో ఓటమి వారిని కుంగదీస్తోంది.  మరోవైపు మోదీ ఇలాకాలో జెండా ఎగరేయడంతో సమాజ్ వాదీ పార్టీ పండుగ చేసుకుంటోంది.  కొన్నాళ్లుగా మోదీ హవా ముందు తేలిపోతూ వస్తున్న వారికి ఈ గెలుపు మంచి ఉత్సాహాన్ని ఇచ్చిందనే అనాలి.