ఉత్తరప్రదేశ్ లో దారుణం..ఉపాధ్యాయుడు శిక్షించటంతో ప్రాణాలు కోల్పోయిన దళిత విద్యార్థి..!

ఇటీవల కాలంలో విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు ప్రవర్తించే తీరు ప్రజలలో కలకలం రేపుతోంది. చిన్న చిన్న కారణాలకు కూడా ఉపాధ్యాయులు ఇచ్చే పనిష్మెంట్ తో విద్యార్థులు మృత్యువాత పడుతున్నారు. ఇటీవల ఉత్తరప్రదేశ్లో కూడా ఇటువంటి దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఉపాధ్యాయుడు విద్యార్థిని చితక వాడటంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ విద్యార్థి ప్రాణాలు కోల్పోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వివరాలలోకి వెళితే…ఉత్తర్ ప్రదేశ్ లోని ఔరయలో అచల్దా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఆదర్శ్ స్కూల్ లో నిఖిత్ కుమార్ అనే విద్యార్థి పదవతరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో సెప్టెంబర్ 7న పాఠశాలలో నిర్వహించిన పరీక్షలలో నిఖిల్ ఒక పదం తప్పు రాసినందుకు అశ్విని సింగ్ అనే ఉపాధ్యాయుడు నిఖిల్ ని కర్రతో కొట్టి దారుణంగా శిక్షించాడు.

దెబ్బలు భరించలేక నిఖిల్ అక్కడికక్కడే స్పృహ కోల్పోయి పడిపోయాడు. ఈ విషయం గురించి సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు పాఠశాలకు చేరుకొని నిఖిల్ ని ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించారు. ఈ క్రమంలో దాదాపు 18 రోజులపాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నిఖిల్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో సోమవారం ప్రాణాలు కోల్పోయాడు. దీంతో నిఖిల్ కుటుంబ సభ్యులు ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేయడమే కాకుండా పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు.