ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోడీకి మరోసారి షాక్ తగిలింది. వనౌటు దేశ ప్రభుత్వం అతనికి ఇచ్చిన పౌరసత్వాన్ని రద్దు చేయాలని నిర్ణయం తీసుకోవడం పెద్ద దెబ్బగా మారింది. కేవలం నేర విచారణ నుంచి తప్పించుకోవడానికి పౌరసత్వాన్ని పొందడం సరైన కారణం కాదని వనౌటు ప్రధాన మంత్రి జోథమ్ నపాట్ స్పష్టంచేశారు. దీంతో లలిత్ మోడీ కోసం కొత్త సమస్యలు తలెత్తాయి. ఇటీవలే ఆయన భారత హైకమిషన్‌కు తన పాస్‌పోర్టును వదులుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారు,
ఇప్పుడు వనౌటు సైతం వెనక్కి తగ్గడంతో పరిస్థితి మరింత సంక్లిష్టమైంది. వనౌటు ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకోవడానికి ఇంటర్‌పోల్ నివేదిక కీలక కారణమైంది. మోడీపై భారత ప్రభుత్వం పెట్టిన రెడ్ నోటీసును ఇంటర్‌పోల్ రెండు సార్లు తిరస్కరించినప్పటికీ, తాజా అంతర్జాతీయ మీడియా నివేదికల ప్రకారం అతను పౌరసత్వాన్ని తప్పించుకునే ఉద్దేశంతో పొందినట్లు స్పష్టమైంది.
వనౌటు ప్రభుత్వం గత నాలుగేళ్లుగా తమ పౌరసత్వ విధానాన్ని కఠినతరం చేస్తూ అనుమానాస్పద వ్యక్తులకు అవకాశం ఇవ్వకుండా చర్యలు తీసుకుంటోందని పేర్కొంది. భారత ప్రభుత్వం ఇప్పటికీ లలిత్ మోడీపై దర్యాప్తును కొనసాగిస్తోంది. ఆయన పాస్‌పోర్టును వదిలినా, కేసుల విషయంలో ఎలాంటి మినహాయింపు ఉండదని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. వనౌటు పౌరసత్వం రద్దవుతే, మోడీ తిరిగి భారత ప్రభుత్వం విచారణకు హాజరవ్వాల్సిన అవకాశం ఉంది. ప్రస్తుతం ఆయన ఏ విధంగా ముందుకు వెళ్తారన్నది ఆసక్తికరంగా మారింది.
2010లో భారత్ విడిచిన లలిత్ మోడీపై కోట్లాది రూపాయల అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే లండన్‌లో నివసిస్తున్న ఆయన ఇప్పుడు వనౌటు మద్దతును కోల్పోయిన నేపథ్యంలో, తదుపరి ప్రణాళిక ఏంటన్నది చర్చనీయాంశంగా మారింది. భారత్‌కు తిరిగి రావడం తప్పదా? లేక మరో దేశం ద్వారా రక్షణ పొందే ప్రయత్నం చేస్తాడా? అన్న దానిపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.


