అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ వినియోగదారులకు హెచ్చరిక

దేశవ్యాప్తంగా ఈ నెల 20 న మొదలైన లారీల సమ్మె ఇంకా కొనసాగుతూనే ఉంది. డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని, దేశమంతటా ఒకే ధరను నిర్ణయించి, ప్రతి మూడు నెలలకొకసారి ధరలను సవరించాలని, టోల్ గేట్లు ఎత్తివేయాలన్న డిమాండ్స్ తో నిరవధిక సమ్మెను చేపట్టారు లారీ యజమానులు. ఈ బంద్ ఎఫెక్ట్ ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీలు అమెజాన్, స్నాప్ డీల్, ఫ్లిప్ కార్ట్ పైన గట్టిగానే పడింది. లారీల బంద్ కారణంగా వినియోగదారులకు సకాలంలో డెలివరీ చేయలేక పోతున్నాయి ఈ సంస్థలు.

జులై 20 వ తేదీనే అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లు రెండు తమ యాన్యువల్ సేల్ ముగించాయి. ఈ సేల్స్ లో ఆర్డర్ చేసుకున్న కస్టమర్లకు డెలివరీ చేయటం ఆలస్యం అవుతుందని అమెజాన్ అధికార ప్రతినిధి తెలిపారు. కష్టమైనప్పటికీ కస్టమర్లకు ఉత్పత్తులు డెలివరీ అయ్యేలా చూస్తున్నామని చెప్పారు. దేశంలో అతి పెద్ద రవాణా సంస్థ అయిన లారీల సమ్మెతో ఉత్తర, పశ్చిమ భారతదేశంలో డెలివరీలపై బాగా ప్రభావం పడిందని స్నాప్ డీల్ కూడా వ్యక్తం చేసింది. కొనుగోలుదారులకు, విక్రయదారులు ఈ విషయంపై సమాచారం అందించామని తెలిపింది.

దేశవ్యాప్తంగా లారీ యజమానులు నిరవధిక సమ్మె కారణంగా సామాన్యులకు ఆర్ధిక ఇబ్బందులు మొదలయ్యాయి. నిత్యావసరాల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. లారీ యజమానులు మాత్రం కేంద్రం దిగి వచ్చి తమ డిమాండ్లు సవరించే వరకు సమ్మె కొనసాగిస్తామని చెబుతున్నారు. ఇంకా ఆలస్యం చేస్తే అత్యవసర సరుకుల రవాణా కూడా నిలిపివేస్తామని హెచ్చరిస్తున్నారు.