జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 35ఏ ను రద్దు చేసే దిశగా బీజేపీ వ్యూహం ?
గత నాలుగు రోజుల నుంచి 28,000 ప్యారా మిలటరీ సైనికులు జమ్మూ కాశ్మీర్ బైపు తరలిపోయారు . ఇదంతా రహస్యంగా జరుగుతుంది . గత వారం 10, 000 మంది సైనికులను కేంద్ర ప్రభుత్వం తరలించింది . మంగళవారం రోజు న్యూ ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా భారతీయ జనతా పార్టీ న ముఖ్య నాయకులతో పాటు జమ్మూ , కాశ్మీర్ రాష్ట్ర నాయకులతో ఓ అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు . ఈ సమావేశంలో కాశ్మీర్ గురించే చర్చించినట్టు తెలుస్తుంది . ఈ సమావేశం అనంతరం ట్రూప్స్ ను కాశ్మీర్ తరలించడం మొదలు పెట్టారు . ఇటీవలే అమిత్ షా హోంశాఖ మంత్రిగా కాశ్మీర్ లో పర్యటించారు .
గత వారం పది కంపెనీలను అంటే 10,000 మంది సైనికులు కాశ్మీర్ వెళ్లిపోయారు . ఈ విధంగా 38 వేలమంది ప్యారా మిలటరీ సైనికులను జమ్మూ కాశ్మీర్ తరలించడం వెనుక కమలనాధుల వ్యూహం ఎదో ఉందనిపిస్తుంది . ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా అని చెబుతున్నా , అసలు ఉద్దేశ్యం వేరుగా ఉందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు . జమ్మూ కాశ్మీర్ లో రాష్ట్రపతి పాలన జులై 3 నుంచి మరో ఆరు నెలల పాటు పొడిగించారు . అదికూడా భారతీయ జనతా పార్టీ వ్యూహంలో భాగమేనని అంటున్నారు. జమ్మూలో భారతీయ జనతా పార్టీ తో కలసి మెహబూబా ముఫ్తి 2016 ఏప్రిల్ 4 న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు .
అయితే ఆ రెండు పార్టీల మధ్య సఖ్యత కుదరనందున జూన్ 19, 2018న భారతీయ జనతా పార్టీ తమ మద్దతును ఉపసంహరించుకుంది . దీంతో ముప్తి ప్రభుత్వం మనుగడ ప్రశ్నార్థకమైంది . గత్యంతరం లేని స్థితిలో మెహబూబా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసింది . అదేరోజున కేంద్రం జమ్మూ కాశ్మీర్లో రాష్ట్రపతి పాలన విధించింది . జమ్మూలో ఎన్నికలు జరపకుండా జులై 3 నుంచి మరో ఆరు నెలలు రాష్ట్రపతి పాలన పొడిగించడంలో ప్రధాని నరేంద్ర మోడీ , కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్ షా వ్యూహాత్మకరంగానే అడుగులు వేస్తున్నారని అర్ధమవుతుంది . ఇటీవల అమిత్ షా పార్లమెంట్లో సి జమ్మూ కాశ్మీర్ పై చేసిన ప్రసంగం , కాంగ్రెస్ పై చేసిన విమర్శలు కూడా వారి అంతర్గత ఆలోచనలు తెలిపాయి .
జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 , ఆర్టికల్ 35 ఏ మీద ఇప్పుడు దేశంలో ఎక్కువగా చర్చ జరుగుతుంది . ఆర్టికల్ 370 జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి ని కలిగిస్తున్నది . ఇక ఆర్టికల్ 35 ఏ ప్రకారం జమ్మూ కాశ్మీర్లో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకున్న వారికి ప్రత్యేక సదుపాయాలను కలిపిస్తుది . ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ లో నివాసం ఉండేవారికి కల్పిస్తున్న ప్రత్యేక హక్కుగా వున్న ఆర్టికల్ 35 ఏ ను రద్దు చేసే దిశగా బీజేపీ పావులు కదుపుతుంది . ఈ విషయాన్ని ఆ పార్టీ ఎన్నికల మేనిపెస్టోలో కూడా పెట్టింది . అందుకే ఇప్పుడు దీనిపై కసరత్తు చేస్తూ రాష్ట్రపతి పాలన పొడిగించింది .
ఈ విషయాన్ని గ్రహించిన జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు , మాజీ ముఖ్య ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు . ఈ మధ్యనే జమ్మూలో ఎన్నికలు జరపమని ప్రధాని నరేంద్ర మోడీతో ఫరూఖ్ సమావేశమయ్యారు . ఇంతలోనే పరిణామాలు తీవ్ర రూపం దాల్చడంతో త్వరలో జమ్మూలో అన్ని పార్టీలతో ఒక సమావేశం ఏర్పాటు చేసి చర్చిస్తామని ప్రకటించాడు . మాజీ ముఖ్యమంత్రి మెహాబూబా కూడా అల్ పార్టీ మీటింగ్ పెడుతున్నట్టు తెలిపారు . ఒకవైపు ఆర్టికల్ 35 ఏ రద్దు చేస్తారనే వార్తలతో జమ్మూ కాశ్మీర్ ప్రజలు భయాందోళనంతో వున్నారు . ఇప్పుడు వేలాది మంది ప్యారా మిలటరీ దళాలు జమ్మూ కాశ్మీర్ లోని సున్నిత ప్రాంతాల్లో మోహరించి వున్నాయి . జమ్మూ కాశ్మీర్ లోపలకు వెళ్లే దారులు , బయటకు వెళ్లే అన్ని దారులను భారత సైన్యం స్వాధీనం చేసుకొని డేగ కన్నుతో కాపలా కాస్తుంది .