సాధారణంగా ఎక్కడైనా కూడా కార్మికులు పనిచేసిన తర్వాత వారికి పనికి తగ్గ ప్రతిఫలం ఆశిస్తూ ఉంటారు. ఇలా ఎంతోమంది వారు చేసిన పనికి సరిపడా ఆదాయం లభిస్తే సంతోషంగా ఉంటారు. అలాకాకుండా వారు ఎంత కష్టపడి పని చేసినా కూడా వారి పనికి సరిపడా ప్రతిఫలం లభించకపోతే మరొకసారి ఆ పని చేయటానికి వారికి మనసు రాదు. మరి కొంతమంది మాత్రం విచిత్రంగా ప్రవర్తిస్తూ వారి కష్టానికి సరిపడా డబ్బులు ఇవ్వనందుకు యజమానుల మీద ప్రతీకారం తీర్చుకుంటూ ఉంటారు. తాజాగా ఇటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. తాను చేసిన పనికి సరిపడా డబ్బులు ఇవ్వకపోవడంతో ఒక టైల్స్ కార్మికుడు ఏకంగా బెంజ్ కార్ ని తగలబెట్టేశాడు.
వివరాలలోకి వెళితే…ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా సెక్టార్-39లో ఈ ఘటన చోటుచేసుకుంది. జలాల్పూర్ గ్రామానికి చెందిన రణవీర్ అనే టైల్స్ కార్మికుడు నోయిడాలోని సదర్పూర్ కాలనీకి చెందిన ఆయుష్ చౌహాన్ అనే వ్యక్తి ఇంట్లో టైల్స్ వేశాడు. ఈ క్రమంలో రణవీర్ చేసిన పనికి గాను ఆయుష్ అతనికి రూ. 68 వేలు చెల్లించాల్సి ఉంది. అయితే కొన్ని రోజులు గడిచిన తర్వాత కూడా ఆయుష్ రణవీర్ చేసిన పనికి డబ్బు చెల్లించలేదు. దీంతో రణవీర్ డబ్బు చెల్లించమని పలుమార్లు ఆయుష్ ని కోరాడు.
అయితే ఆయుష్ మాత్రం నిర్లక్ష్యంగా సమాధానాలు చెబుతూ తర్వాత ఇస్తానని చెప్పి డబ్బులు ఇవ్వకుండా మాట దాటవేస్తున్నాడు. దీంతో ఆయుష్ ప్రవర్తనతో విసిగిపోయిన రణవీర్ కడుపు మంటతో ఆయుష్ ఇంటిముందు పార్క్ చేసి ఉన్న బెంజ్ కార్ మీద పెట్రోల్ పోసి నిప్పు పెట్టి అక్కడి నుండి పరారయ్యాడు. రూ. 68 వేల కోసం లక్షల విలువ చేసే కార్ కి నిప్పు అంటించాడు. ఈ విషయం గ్రహించిన ఆయుష్ లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించి రణవీర్ మీద ఫిర్యాదు చేసాడు. దీంతో పోలీసులు పరారీలో ఉన్న రణవీర్ ని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.