ఏపీ బీజేపీ అధ్యక్షుడు జగన్ కి అనుకూలంగా వుంటారా?

ఈ మీమాంస సాదా సీదాగా తోచవచ్చు. కాని దీనికి వచ్చే సమాధానం ఎంతో ప్రాధాన్యత కలిగి వుంది. ఆంధ్ర ప్రదేశ్ బిజెపి రథ సారధిగా నియమింపబడే నేత ఎవరో తేలితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యెడల బిజెపితో పాటు కేంద్ర ప్రభుత్వం అవలంభించే విధానం వెల్లడౌతుంది. ఆంధ్ర ప్రదేశ్ బిజెపిలో వైసిపి ప్రభుత్వం మీద కత్తి కట్టిన వారున్నారు ప్రభుత్వానికి అనుకూలురు వున్నారు. వీరిలో ఎవరు రాష్ట్ర పార్టీ సారధ్యం వహిస్తారో తేలి పోతే మొత్తం వ్యవహారం ఒక కొలిక్కి వస్తుంది.

రాష్ట్ర బిజెపిలో పలు ముఠాలు వున్నా ప్రధానంగా వైసిపి టిడిపికి సమానదూరంలో వుండి ప్రజాపోరాటాలు నిర్వహించాలని అప్పుడే పార్టీని విస్తరించ వచ్చని ప్రస్తుతం అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత రాష్ట్రంలో అస్తవ్యస్త పరిస్థితులు ఏర్పడ్డాయని బహిరంగంగా ప్రకటనలు చేశారు.

అయితే ఎన్ఢీఏలో వైసిపి చేర వచ్చని మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన ప్రకటనపై కన్నా లక్ష్మీనారాయణ స్పందించుతూ తమకు ఎట్టి సమాచారం లేదని రాష్ట్రంలో బిజెపి కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని కడప జిల్లాలో దాడికి గురైన వారిపైననే కేసులు పెడుతున్నారని ఆరోపించారు. టిడిపి వైసిపికి సమాన దూరంలో బిజెపి వుంటుందన్నారు. ప్రధానంగా రాజధాని రైతుల పోరాటానికి పూర్తి మద్దతు ప్రకటించారు.

అయితే సోము వీర్రాజు లాంటి నేతలు కొందరు టిడిపిపై కారాలు మిరియాలు నూరుతూ వైసిపి యెడల సానుకూల వైఖరితో వున్నారు. శుక్రవారం వైసిపి నేతలు చంద్రబాబు నాయుడుపై చేసిన రాజకీయ దాడికి సోము వీర్రాజు గొంతు కలిపారు. ఇదిలా వుండగా రాష్ట్రానికి చెంది జాతీయ అధికార ప్రతినిధిగా వున్న జివియల్ నరసింహా రావు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనుకూలుడుగా ముద్ర పడింది. అధ్యక్ష పదవి నియామకంలో ఆయన వైఖరి ఎంత వరకు పనిచేస్తుందో చూడాలి. అధ్యక్ష పదవి ఆశించే వారిలో సోము వీర్రాజు ఎమ్మెల్సీ మాధవ్ వున్నారని చెబుతున్నారు. వీరు కాకుండా పురందరేశ్వరి పేరు ప్రచారంలో వుంది. రాష్ట్రంలో రెండు సామాజిక వర్గాలు టిడిపి వైసిపి వెంట వున్నందున కాపు సామాజిక వర్గానికే పట్టం కడతారని చెబుతున్నారు. ఏది ఏమైనా రాష్ట్ర బిజెపి అధ్యక్షుని నియామకంతో కేంద్ర ప్రభుత్వం వైసిపి ప్రభుత్వం యెడల గైకొనే వైఖరిని కొంత మేరకు అంచనా వేయ వచ్చు.

ఈ నేపథ్యంలో బిజెపి అధిష్టాన వర్గం మధ్య ప్రదేశ్ సిక్కిం కేరళ రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను ప్రకటించింది. కాబట్టి ఇక త్వరలోనే ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియమించుతారని వార్తలు వచ్చాయి. త్వరలోనే ఎపి అధ్యక్షులు ఎవరో తేలి పోనున్నది.