మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ఎట్టకేలకు పోలీసుల చేతికి చిక్కాడు. ఆరు రోజుల పోలీసు వేట తర్వాత దొరికిన వికాస్ దూబే దొరకడం చాలా చిత్రంగా జరిగింది. ఈ నెల 3వ తేదీన వికాస్ దూబే యూపీలోని కాన్పూర్ శివార్లలో ఉన్న బికరూ గ్రామంలో తనను పట్టుకోవడానికి వచ్చిన పోలీసుల మీద తన గ్యాంగ్ సభ్యులతో కలిసి కాల్పులకు తెగబడ్డాడు. ఆ కాల్పుల్లో 8 మంది పోలీసులు అమరులయ్యారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అమరులైన పోలీసుల్లో డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ దేవేంద్ర మిశ్రాతో ముగ్గురు సబ్ ఇన్స్పెక్టర్లు, నలుగురు కానిస్టేబుళ్లు ఉన్నారు.
దీంతో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వెంటనే దూబేను, అతని అనుచరులను పట్టుకుని చట్టం ముందు నిలబెట్టాలని ఆదేశించారు. దీంతో యూపీ పోలీసులు పూర్తి సన్నద్దతతో రంగంలోకి దిగారు. వికాస్ దూబే ఆచూకీ తెలిపితే 5 లక్షల రివార్డ్ ఇస్తామని ప్రకటించారు. ఘటన జరిగిన రోజే దూబే గ్యాంగ్ సభ్యుల్లో ఇద్దరిని ఎన్ కౌంటర్లో హతమార్చారు. అలాగే వికాస్ ముఖ్య అనుచరుడు బౌవా దూబే గురువారం జరిగిన పోలీస్ కాల్పుల్లో మృతిచెందాడు. మరొక అనుచరుడు ప్రభాత్ మిశ్రా కాన్పూర్లో కస్టడీలో ఉండగానే పోలీసుల మీద దాడికి దిగడంతో అతను కూడా ఎన్ కౌంటర్లో హతమయ్యాడు.
ఇలా అనుచరులు ఒకొక్కరుగా పోలీసుల చేతిలో హతమవుతుండటంతో వికాస్ దూబే బలం తగ్గుతూ వచ్చింది. దీంతో స్థావరాలు మార్చుకుంటూ యూపీ దాటి హర్యానా ఆ తర్వాత మధ్యప్రదేశ్ రాష్ట్రంలోకి ఎంటరైన వికాస్ దూబే ఈరోజు ఉదయం ఉజ్జయినిలోని మహంకాళి ఆలయంలోకి పూజలు జరిపేందుకు వెళ్లాడు. అక్కడ విధుల్లో ఉన్న గార్డ్ దూబేను గుర్తుపట్టి పట్టుకున్నాడు. అనంతరం ఉజ్జయిని జిల్లా ఎస్పీకి సమాచారం ఇచ్చాడు. పోలీసులు మధ్యప్రదేశ్ సీఎంకు వికాస్ దూబేను అదుపులోకి తీసుకున్నట్టు క్కన్ఫర్మ్ చేయడంతో ఆయన యూపీ సీఎం యోగికి తెలిపారు. ప్రస్తుతం దూబే ఉజ్జయిని పోలీసుల కస్టడీలోనే ఉన్నాడు.