రెండుగంటల హైపర్ థ్రిల్లర్! (‘కిల్లర్’)

తెలుగులో తమిళ విజయ్ అంటోనీ తాజా మూవీ ‘కిల్లర్’ ట్రైలర్ తో ఒక ఆసక్తిని, సస్పెన్స్ నీ రేకెత్తించిన విషయం తెలిసిందే. తీరా ఆ ట్రైలర్ కి, సినిమాకీ సంబంధం లేదని తెలిస్తే ట్రైలర్ రూపొందించిన దర్శకుడి మీద చిన్నచూపు ఏర్పడే అవకాశముంది. సినిమాలో మంచి కంటెంట్ వున్నాక ట్రైలర్ తో మిస్ లీడ్ చేయాల్సిన అవసరమేమిటో తెలీదు. ట్రైలర్ తో ఇది మరో రొటీన్ సైకో కిల్లర్ కథ అన్నట్టు అభిప్రాయం కల్గించారు. మళ్ళీ సైకో కిల్లర్ ని ఏం చూస్తామని ప్రేక్షకులు ఆగిపోతే ఆ ట్రైలర్ సినిమాకి మైనస్సే అవుతుంది. కానీ ట్రైలర్ లో మిస్ లీడ్ చేసిన విషయం కంటే స్ట్రాంగ్ కంటెంట్ సినిమాలో వుంది. ఇప్పటికైనా ట్రైలర్ ని సినిమాలో కంటెంట్ ప్రకారం మార్చి రిలీజ్ చేస్తే సినిమాకి ప్లస్ అయ్యే అవకాశముంది. ఇంతకీ సినిమాలో వున్న స్ట్రాంగ్ కంటెంట్ ఏమిటి? ఇదొకసారి చూద్దాం…

కథ

ఒక యువతి హత్యతో ప్రారంభమవుతుంది. ఈ యువతిలాగే వున్న ఇంకో యువతి జయంతి (ఆషిమా నర్వాల్) కథలోకి ప్రవేశిస్తుంది. దీనికంటే ముందు, ప్రభాకర్ (విజయ్ ఆంటోనీ) అనే అతను పోలీసులకి లొంగిపోయి ఈ హత్య తనే చేశానంటాడు. ఏ హత్య? ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కార్తికేయ (అర్జున్) దృక్కోణంలో కొన్ని రోజులు వెనక జరిగిన ఒక హత్య తెర పైకి వస్తుంది. ఆ సగం సగం కాలిన గుర్తు తెలియని శవం వంశీ దని గుర్తిస్తాడు. వంశీ ఏపీ మంత్రి తమ్ముడు. ఇతన్ని తను చంపానంటాడు ప్రభాకర్. కార్తికేయ నమ్మడు. ఇతన్ని జయంతీ, ఆమె తల్లీ (సీత) కలిసి చంపి వుండాలని గట్టి అనుమానం.

ఇందుకు మోటివ్ కూడా దొరుకుతుంది. వంశీ జయంతిని పెళ్లి చేసుకొమ్మని గత రెండేళ్లుగా సైకోలా వెంట పడి వేధిస్తున్నాడు. ఇందుకే చంపేశారని కార్తీక్ అనుమానం. కాదు, వాళ్ళ ఎదుటి ఫ్లాట్ లో వున్న తనే చంపానని ప్రభాకర్ వాదన. ఏమిటీ మిస్టరీ? ఎవరు చంపారు? చంపి వుంటే ఎవరు ఎవర్ని చంపారు? మొదట చూపించిన హత్యకి గురైన ఆ యువతి ఎవరు? ఆమెని ఎవరు చంపారు? ఈ రెండు హత్యలేనా, తెలియకుండా మూడో హత్య మిస్టరీ కూడా వుందా? అసలు ప్రభాకర్ ఎవరు? ఎందుకు హత్యని క్లెయిమ్ చేస్తున్నాడు? జయంతీ తనూ ప్రేమించుకోనే లేదు. కానీ ఆమె కోసం ఎన్ని హత్యలైనా చేస్తానని ఎందుకంటున్నాడు? ఇదీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కార్తికేయ ముందున్న కొరకరాని కొయ్యలా తయారైన కేసు…

 

ఎలావుంది కథ

ట్రైలర్ లో చూపించినట్టు సైకో కిల్లర్ కథ కాదు. హీరోకున్న ఒక బాధాకర గతం, దాంతో హత్యలో ఇరుక్కున్న తల్లీ కూతుళ్ళని కాపాడేందుకు ఆ గతాన్నే ఎరగా వేసి మానవత్వాన్ని చాటునే ఆ హీరో కథే ఇది. ఎక్కడో ఎమోషనల్ కనెక్ట్ లేకపోతే ఇలాటి డార్క్ మూవీస్ చెయ్యడు ఆంటోనీ. ఈ కథని జపనీస్ నవల ‘ది డివోషన్ ఆఫ్ సస్పెక్ట్ ఎక్స్’ నుంచి పాయింటు మాత్రమే తీసుకుని చేశానన్నాడు దర్శకుడు ఆండ్రూ లూయిస్. జరిగిన ఒక హత్యని హీరో కవర్ చేయడమనే పాయింటు. ఈ పాయింటుకి పకడ్బందీ కథనం చేశాడు. లాజికల్ గా ఎక్కడా ప్రశ్నలు వదలకుండా స్క్రీన్ ప్లే నిర్వహించాడు. అయితే ఒక మౌలిక ప్రశ్న వుండిపోయింది. రెండేళ్లుగా ఆ తల్లీ కూతుళ్ళని వేధిస్తూంటే పోలీస్ కంప్లెయింట్ ఎందుకివ్వ లేదు? మంత్రి తమ్ముడనా? దీనికి స్పష్టత నివ్వలేదు.

ఎవరెలా చేశారు ?

ఆంటోనీ పూర్తిగా లో ప్రొఫైల్ క్యారెక్టర్ లో కన్పిస్తాడు. పాత్ర గతాన్ని బట్టి ఇలా కన్పిస్తాడు. ఫ్లాష్ బ్యాక్ లో రోమాన్స్, పాటలూ వుంటాయి. ఇవి నీటుగా వుంటాయి. నటన పోతున్నకొద్దీ చిక్కనవుతూ, చివరి సన్నివేశాల్లో అసలు విషయాలు చెప్పినప్పుడు సానుభూతి నంతా రాబట్టుకుని, పాత్రకి ఔన్నత్యాన్ని కల్పిస్తాడు. ఈ ముగింపే ఈ హత్యల నార్మల్ కథకి ప్రేక్షకులతో గట్టి బాండింగ్ నేర్పరుస్తుంది.
ఆషిమా నర్వాల్ రెండు పాత్రల్లో నీటుగా నటించింది. తను చేసిన పనికి నింద అతను మీదేసుకుంటే పడే మానసిక సంఘర్షణ ఆమెకి హైలైట్ సన్నివేశం. ఇంతకీ అతను తనకేమీ కాడు. ఇదింకో ఎమోషనల్ బ్యాగేజీ. ఇక తల్లి పాత్రలో సీత కూడా ఎక్సెలెంట్. అసలు హత్యా దృశ్యంలో వీళ్ళిద్దరి నటనే ఒక ఎట్రాక్షన్ సినిమాకి.

పోలీసాఫీసర్ గా ఎక్కడా ఒక చిన్న స్మైల్ కూడా ఇచ్చుకోని సినిక్ లా వుండే పాత్రలో అర్జున్ ఇంకో బలం ఈ సినిమాకి. కథని ఇతనితోనే ఫాలో అవుతూంటాం. తను ముప్పు తిప్పలు పడి, మనల్ని ముప్పు తిప్పలు పెట్టేస్తాడు. ఇతడికి లాజిక్ పాఠాలు చెప్తూ మెలిదిప్పే పై ఆఫీసర్ పాత్రలో నాజర్ ఓ పక్క.
నటులు, నటనలు రెండు గంటల ఒక బలమైన ఈ థ్రిల్లర్ డ్రామా సృష్టించాక, చెప్పుకోవాల్సింది టెక్నికల్ గా కెమెరా, ఎడిటింగ్, కలర్ థీమ్. బిజిఎం ఇంకో ప్లస్ కాగా, రెండు డ్యూయెట్లు రిలీఫ్ నిస్తాయి. మొదటి డ్యూయెట్ ప్రారంభంలో ఐదు నిమిషాలకే వచ్చేస్తుంది.
కొత్త దర్శకుడు ఆండ్రూ లూయిస్ కొత్త దర్శకుడిలా అన్పించడు.

చివరికేమిటి

అనేక ఫ్లాష్ బ్యాక్స్, ఫ్లాష్ ఫార్వర్డ్స్ తో వుండే కాంప్లికేటెడ్ కంటెంట్. దీన్ని గజిబిజి చేసి అభాసు అవకుండా అర్ధమయ్యేలా క్లియర్ చేసుకుంటూ కథ చెప్పుకు పోయాడు. ఈ కథ ఎండ్స్ సస్పెన్స్ గండంలో పడే వైపు వెళ్తోందని ఇంటర్వెల్ కల్లా అన్పిస్తుంది. అయితే ఇంటర్వెల్ తర్వాత పదిహేను నిమిషాల కల్లా ఎండ్ సస్పెన్స్ ని తీర్చేసి, సీన్ టు సీన్ సస్పెన్స్ చేసుకుంటూ పోవడంతో బతికింది సినిమా.
ఇక చిట్ట చివర్లో వుంటుందని అస్సలూహించని సస్పన్స్ బయట పడడం మాస్టర్ స్ట్రోక్. ఇది హీరో గతంతో. అప్పుడు ఇక్కడే మొదలైన కథ ఇదంతా అని అర్ధమవుతుంది. ‘ది మాగ్నిఫిషెంట్ సెవెన్’ లో డెంజిల్ వాషింగ్టన్ చివర్లో విలన్ కి తన గతాన్ని రివీల్ చేసి, పాత్రని ఎక్కడికో తీసికెళ్ళి పోయినట్టుగా.
ఐతే ఈ పోలీస్ ప్రొసీజురాల్ సస్పెన్స్ థ్రిల్లర్ జానర్లో పానకంలో పుడకలా ఇంటర్వెల్ వస్తుంది. ఇంటర్వెల్ లో అకస్మాత్తుగా విజయ్ అంటోనీ ఐపీఎస్ ఆఫీసర్ గా రివీల్ అయి, రౌడీల్ని తరుముతూంటాడు. తరుముతూంటే – ‘ధైర్యం నీ వెనుకా, సైన్యం నీ లెక్కా’ – అంటూ మసాలా సాంగ్ రావడం! ఎలాటి కథ ఎలా అయిపోయిందన్పిస్తుంది!
ఈ పానకంలో పుడక ఇంటర్వెల్ తప్పితే, మిగతా సెకండాఫ్ దారిలో పడుతుంది జానర్. రెండు గంటల సేపు బయటి ప్రపంచాన్ని మర్చిపోయి చూసేలా చేసే ఈ సస్పెన్స్ థ్రిల్లర్, తమిళం నుంచి వచ్చిన ఒక బాక్సాఫీసు సక్సెస్ స్టోరీ.

రచన – దర్శకత్వం : ఆండ్రూ లూయిస్
తారాగణం : విజయ్ ఆంటోనీ, అర్జున్, ఆషిమా నర్వాల్, నాజర్, సీత తదితరులు
సంగీతం : సైమన్ కింగ్, ఛాయాగ్రహణం : ముఖేష్
నిర్మాత : అంజయ్య
విడుదల : జూన్ 7, 2019
Rating: 3 / 5

—―సికిందర్