Gaalodu Review Movie Review And Rating: సుడిగాలి సుధీర్ గాలోడు గాలి ఎలా ఉందంటే?

సుడిగాలి సుధీర్‌కు బుల్లితెరపై ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. వెండితెరపై అసలైన మాస్ హీరోగా ఎదిగేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో ఫుల్ మాస్ మసాలా కమర్షియల్ అంశాలతో ఉన్న గాలోడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ చిత్రం ఎలా ఉంది? సుధీర్‌కు ఎలాంటి ఇమేజ్ తీసుకొచ్చింది? ఆడియెన్స్‌ ఏ మేరకు రిసీవ్ చేసుకుంటారు? అనేది చూద్దాం.

కథ
రజినీకాంత్ అలియాస్ రాజు (సుధీర్) పల్లెటూరిలో ఆకతాయిలా గాలికి తిరిగే కుర్రాడు. ఓ సారి పేకాటలో అనుకోకుండా సర్పంచ్ కొడుకుని కొడతాడు. ఆ దెబ్బతో అతను చనిపోతాడు. దీంతో ఆ కేసు నుంచి తప్పించుకునేందుకు రాజు సిటీకి పారిపోతాడు. అక్కడ శుక్లా (గెహ్నా సిప్పీ)తో పరిచయం ఏర్పడింది. ఆ తరువాత అది ప్రేమకు దారి తీస్తుంది. ఆ తరువాత రాజు జీవితంలో జరిగిన ఘటనలు ఏంటి? రాజుని వెతుక్కుంటూ వచ్చిన పోలీసులు చివరకు ఏం చేస్తారు? రాజు ఈ కేసు నుంచి ఎలా బయటపడతాడు? ఈ కథలో లాయర్ విజయ్ భాస్కర్ (సప్తగిరి) పాత్ర ఏంటి? శుక్లా రజినీల ప్రేమ కథ చివరకు ఏమవుతుంది? అనేది కథ.

నటీనటులు
గాలోడు సినిమాకు అంతా తానై ముందుండి చూసుకున్నాడు సుధీర్. ఫైట్స్, యాక్షన్, కామెడీ, రొమాన్స్ ఇలా అన్నింట్లోనూ సుధీర్ మెప్పించాడు. ఈ చిత్రానికి సుధీర్ బ్యాక్ బోన్‌లా నిల్చున్నాడు. సుధీర్ ఫ్యాన్స్‌కు మాత్రం మీల్స్‌లా అనిపిస్తుంది. నటన, కామెడీ ఇలా ప్రతీ విషయంలో అభిమానులను మెప్పిస్తాడు. ఇక శుక్లా పాత్రలో నటించిన హీరోయిన్ గెహ్నా సిప్పీ చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది. పాటలు, సీన్ల వరకే ఆమె పాత్ర పరిమితమైనట్టుగా అనిపిస్తుంది. సప్తగిరి తన స్టైల్లో నవ్వించేశాడు. మిగిలిన పాత్రలన్నీ పరిధి మేరకు మెప్పించాయి.

విశ్లేషణ
మాస్ కమర్షియల్ సినిమాలకు ఎప్పుడూ గిరాకీ ఉంటుంది. సరైన కథ పడితే మాస్ ఆడియెన్స్ తమ చాటుతుంటారు. సినిమాలకు ఎప్పుడూ మాస్ ఆడియెన్సే అండ. అలాంటి మాస్ ఆడియెన్స్‌ను మెప్పించేందుకు ఈ గాలోడు చిత్రం వచ్చింది. అయితే కథ పాతగా అనిపిస్తుంది.. కథనం కూడా రొటీన్‌గానే అనిపిస్తుంది. కానీ అక్కడక్కడా వచ్చే ట్విస్టులు, టర్న్‌లు మాత్రం మెప్పిస్తాయి.

అసలు కథను సెకండాఫ్‌లోనే రివీల్ చేస్తారు. అయితే ప్రథమార్థంలో కాస్త బోరింగ్ అనిపిస్తుంది. రొటీన్ లవ్ స్టోరీ సీన్లలా అనిపిస్తాయి. ద్వితీయార్థంలో మాత్రం గాలోడు కాస్త మెప్పించేస్తాడు. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సినిమాలకు బలంగా మారుతాయి. అయితే అవసరానికి మించి పెట్టినట్టుగా యాక్షన్ సీక్వెన్స్ కనిపిస్తాయి. మాటలు అక్కడక్కడా బాగానే పేలాయి. పాటలు బాగానే అనిపిస్తాయి. కెమెరాపనితనం మెప్పిస్తుంది. అక్కడక్కడా కొన్ని సీన్లకు కత్తెర పడాల్సినట్టుగా అనిసిస్తుంది.

గాలోడు మాత్రం వన్ మెన్ షోలా అనిపిస్తుంది. సుధీర్ అభిమానులను ఆకట్టుకునేలా ఉంటుంది. కథ, కథనాలు, లాజిక్స్ అంటూ పట్టించుకోకుండా.. వినోదాన్ని మాత్రం ఎంజాయ్ చేయాలనుకునే మాస్ ఆడియెన్స్‌ను గాలోడు మెప్పించే అవకాశాలున్నాయి. సాంకేతికంగానూ ఈ చిత్రం ఉన్నతంగా అనిపిస్తుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

రేటింగ్ : 3/5

బాటమ్ లైన్ : సూదిగాలోడి సుధీర్ షో.. వన్ మ్యాన్ షో!