పేరు: ఒరేయ్ బుజ్జిగా
విడుదల తేదీ: అక్టోబర్ 1, 2020
నటీనటులు: రాజ్ తరుణ్, హెబ్బా పటేల్, మాళవిక నాయర్, వాణీ విశ్వనాథ్, నరేష్, పోసాని కృష్ణమురళి
డైరెక్టర్: కొండా విజయ్ కుమార్
ప్రొడ్యూసర్: కేకే రాధా మోహన్
మ్యూజిక్ డైరెక్టర్: అనూప్ రూబెన్స్
సినిమాటోగ్రఫీ: ఆండ్రూ
గుండెజారి గల్లంతయ్యిందే సినిమా చూశారా మీరు. ఆహా.. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ కదా. ఆ సినిమా డైరెక్టర్ విజయ్ కుమార్ కొండానే ఒరేయ్ బుజ్జిగా సినిమాకు కూడా డైరెక్టర్. విజయ్ కుమార్ అంటేనే ప్రేమ కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్. ఆయన తీసిన ప్రేమ కథా చిత్రాలన్నీ హిట్. తాజాగా రాజ్ తరుణ్ తో మరో ప్రేమ కథా చిత్రాన్ని అల్లాడు విజయ్ కుమార్. కరోనా వల్ల.. థియేటర్లలో సినిమా రిలీజ్ కాలేకపోయినప్పటికీ.. ఓటీటీ ప్లాట్ ఫామ్ లో సినిమా రిలీజ్ అయింది. మరి.. విజయ్ కుమార్ తన కొత్త ప్రేమ కథను ప్రేక్షకులకు నచ్చేలా చెప్పాడా? లేదా చూద్దాం పదండి..
సినిమా స్టోరీ ఇదే
సినిమా టైటిల్ చూసినప్పుడే మీకు అర్థమయిపోయి ఉంటుంది. ఈ సినిమాలో హీరో పేరు ఏంటో. అవును.. మీరు గెస్ చేసింది కరెస్టే.. ఈ సినిమాలో హీరో‘( రాజ్ తరుణ్ ) పేరు బుజ్జి. అంటే అది ముద్దు పేరు. అసలు పేరు శ్రీను. కానీ.. అందరూ ఒరేయ్ బుజ్జిగా.. ఒరేయ్ బుజ్జిగా అని పిలిచేస్తుంటారు మనోడిని.
ఇక పోతే కృష్ణవేణి(మాళవిక నాయర్), బుజ్జి ఇద్దరిదీ ఒకే ఊరు. కానీ.. ఇద్దరికి ముందు పరిచయం ఉండదు. ఇద్దరు ఒకేసమయంలో ఊరు వదిలి పారిపోతారు. తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని కృష్ణవేణి పారిపోగా… తన ప్రేమను దక్కించుకోవడం కోసం బుజ్జి పారిపోతాడు. ఇద్దరూ ఒకే ట్రెయిన్ లో తారసపడతారు. ఇద్దరికీ పరిచయం పెరుగుతుంది.కానీ.. ఇద్దరూ తమ అసలు పేర్లను కాకుండా.. వేరే పేర్లు చెప్పుకుంటారు. బుజ్జి తన పేరు శ్రీను అంటాడు. కృష్ణవేణి నా పేరు స్వాతి అంటుంది.
కట్ చేస్తే.. ఒకే ఊరు వాళ్లు కావడంతో ఇద్దరూ కలిసి లేచిపోయారని ఊళ్లో ప్రచారం జరుగుతుంది. దీంతో శ్రీను, కృష్ణవేణి కుటుంబాల్లో గొడవ జరుగుతుంది. ఇద్దరూ కలిసి హైదరాబాద్ వెళ్లాక.. ఎవరి దారి వాళ్లు చూసుకుంటారు. అయితే.. తమ వల్ల ఊళ్లో గొడవలు జరుగుతున్నాయని తెలుసుకున్న బుజ్జి… కృష్ణవేణిని వెతకడం ప్రారంభిస్తాడు. అయితే తనకు స్వాతిగా పరిచయం అయిన అమ్మాయే కృష్ణవేణి అని బుజ్జికి తెలియదు. కృష్ణవేణి కూడా ఊళ్లో జరుగుతున్న విషయాలు తెలుసుకొని బుజ్జిగాడి మీద సీరియస్ గా ఉంటుంది. అయితే.. స్వాతి, శీనుగా పరిచయం అయిన వీళ్లిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది.
నిజానికి తన ప్రేయసి సృజన(హెబ్బా పటేల్) ను కలవడానికి.. తనను పెళ్లి చేసుకోవడానికి బుజ్జిగాడు హైదరాబాద్ కు వచ్చినా.. బుజ్జిగాడు కృష్ణవేణి ప్రేమలో ఎందుకు పడతాడు? తన ప్రేయసి సృజనతో ఎందుకు బుజ్జిగాడు విడిపోయాడు? తర్వాత స్వాతే కృష్ణవేణి అని బుజ్జిగాడికి… శ్రీనే బుజ్జిగాడు అని కృష్ణవేణికి ఎలా తెలుస్తుంది? చివరకు రెండు కుటుంబాల మధ్య గొడవలు ఎలా తగ్గాయి? తర్వాత కృష్ణవేణి, బుజ్జిగాడు ఎలా ఒకటయ్యారు? అనేదే మిగితా కథ.
సినిమా ప్లస్ పాయింట్స్
సినిమాలో ప్లస్ పాయింట్స్ అంటే కామెడీ అనే చెప్పుకోవాలి. రాజ్ తరుణ్ కామెడీ టైమింగ్ బాగుంది. ప్రేక్షకులను అయితే బాగానే నవ్వించాడు. ఎలాగూ రాజ్ తరుణ్ యాక్టింగ్ గురించి డౌట్ లేదు కాబట్టి.. రాజ్ తరుణ్ నటన ఈ సినిమాకు ప్లస్ పాయింటే. మాళవిక నాయర్.. చాలా నాచురల్ గా నటించింది. హెబ్బా పటేల్.. గ్లామర్ షో బాగానే చేసింది. సప్తగిరి, వాణి విశ్వనాథ్, పోసాని, నరేష్, సత్య.. అందరూ తమ పాత్రల మేరకు బాగానే నటించారు. అనుప్ సంగీతం కూడా సినిమాకు ప్లస్.
మైనస్ పాయింట్స్
అయితే సినిమాలో కొత్తదనం పూర్తిగా తగ్గిపోయింది. అదే పాత చింతకాయ పచ్చడిని మళ్లీ ఇంకోలా చూపినట్టే ఉంది. పాత కథనే కొత్తగా చెబుదామనుకున్నారు కానీ.. ఎక్కడో లోపం మాత్రం స్పష్టంగా కనిపించింది. రాజ్ తరుణ్ పాత్రలో కూడా ఎక్కడా కొత్తదనం లేదు.
కన్ క్లూజన్
రొమాంటిక్ ప్రేమ కథా చిత్రం అయినప్పటికీ.. కథలో కొత్తదనం లేకపోవడంతో సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. కాకపోతే సినిమాలో యూత్ కు నచ్చే కొన్ని సీన్లు ఉండటం, కామెడీ సీన్స్ బాగానే నవ్వించడం, లవ్ సీన్స్ పండటం మూలాన కరోనా సమయంలో ఈ సినిమాను ఎంజాయ్ చేయొచ్చు.
తెలుగు రాజ్యం రేటింగ్ : 2.5/5