‘మల్లేశం’ రివ్యూ – ఆలోచింపజేసే ఆర్టు!

తెలంగాణా సినిమా వాస్తవిక కథా చిత్రాలవైపే ఎక్కువ వుంటుంది. మొదటినుంచీ ఈ పంథానే అనుసరిస్తోంది. తెలంగాణా ప్రాంతం గురించి ఏదో చెప్పాలన్న తపన. దేశంలో ఇంకా 18 ప్రాంతీయ చలన చిత్ర రంగాలున్నాయి. ప్రపంచీకరణ ప్రభావంతో ఇవి తమ ప్రాంతీయ అస్తిత్వాల ఘోష ఏనాడో వదులుకుని కమర్షియల్ బాట పట్టేశాయి. హిందీ తెలుగు తమిళ కమర్షియల్ సినిమాల్ని అనుకరిస్తూ చీప్ బడ్జెట్స్ తో నిర్మించేస్తున్నారు. నేటి తరం ప్రాంతీయ ప్రేక్షకులు కూడా ఇవే ఎంజాయ్ చేస్తున్నారు. వీటి వల్లే అవి తమ ప్రాంతాల పేర్లకి ‘వుడ్’ తగిలించుకుని జాలీవుడ్ (ఝార్ఖండ్), చోలీ వుడ్ (చత్తీస్ ఘర్) అంటూ కొత్త పేర్లు పెట్టుకుని పరిశ్రమలుగా వర్థిల్లుతూ, స్థానికంగా ఎందరో కళాకారులకీ సాంకేతికులకీ ఉపాధి కల్పిస్తున్నారు. సమస్యలు చూపిస్తే చూసే కాలం పోయినట్టు, సరదాలు చూపిస్తేనే ఆనందించే కాలం నడుస్తోంది. ఇందువల్లే ఆర్థికంగా ప్రాంతీయ సినిమా రంగాలు నిలబడుతున్నాయి. తెలంగాణా సినిమా ఇలా కాదు. ఇక్కడ ఇంకా ఆర్ట్ సినిమా ధోరణులనే పట్టుకుని ప్రేక్షకుల్ని వెతుక్కునే పరిస్థితుల్లో వుంటున్నాయి. ఎప్పుడో ‘పెళ్లి చూపులు’ లాంటి కమర్షియల్ వచ్చి తెలుగు ప్రాంతాల కతీతంగా ఆదరణ పొందుతుంది.

ఈ నేపథ్యంలో ‘మల్లేశం’ అనే బయోపిక్ ని ఆర్ట్ ఫిలింలా నిర్మించారు. ఈ సాహసం సరైనదేనా? ఒకసారి చూద్దాం…


కథ

1980 లలో మల్లేశం (ప్రియదర్శి) కుటుంబ పరిస్థితుల వల్ల ఆరో తరగతి వరకే చదివి నేస్తాలతో సినిమాలకీ షికార్లకీ తిరుగుతూంటాడు. 1990 లలో పెద్దవాడై ప్రేమా పెళ్ళీ కానిచ్చి స్థిరపడతాడు. కానీ చేనేత కుటుంబానికి చెందిన అతను మగ్గం నేసే తల్లి లక్ష్మి (ఝాన్సీ) బాధ చూడలేకపోతాడు. మగ్గం నేసే ఆడవాళ్ళ భుజాల ఎముకలు అరిగిపోయి ఏ పనీ చేయలేని పరిస్థితి వుంటుంది. ఈ పరిస్థితే తల్లికీ వస్తుంది. దీంతో ఈ సమస్యకి పరిష్కారం కనుగొనాలని నిశ్చయించు కుంటాడు. కరెంటుతో నడిచే ఆసు యంత్రాన్ని తయారుచేయాలన్న అతడి ఆలోచనకి హేళనలు అవమానాలూ చాలా ఎదురవుతాయి. ఇంజనీర్ అంటూ వెక్కిరిస్తారు. యంత్రం తయారీ కోసం పట్టుదలతో అప్పులు కూడా చేసి ఇబ్బందుల్లో పడిపోతాడు. తండ్రి (చక్రపాణి) ఛీత్కారాలూ ఎదుర్కొంటాడు. ఇక బ్రతుకుతెరువు వెతుక్కుంటూ భార్య పద్మ (అనూషా నాగళ్ల) తో హైదరాబాద్ చేరుకుంటాడు. అక్కడ చిన్నా చితకా పనులు చేసి బతుకుతున్నా, ఆలోచనలన్నీ ఆసు యంత్రంమీదే వుంటాయి. ఈ నేపథ్యంలో అష్టకష్టాలూ పడి తన ఆశయం ఎలా నేరవేర్చుకున్నాడనేది మిగతా కథ.

ఎలావుంది కథ

ఇది చింతకింది మల్లేశం అనే చేనేత కార్మికుడి నిజజీవిత విజయగాథ. కోరుకున్న రంగంలో విజయం సాధించాలన్న కాంక్షతో మజిలీ, జెర్సీ, చిత్రలహారి, మహర్షి లాంటి కల్పిత కథల కమర్షియల్ సినిమాలు వరసగా వచ్చాక, కొస మెరుపుగా రియల్ సక్సెస్ స్టోరీతో ‘మల్లేశం’ బయోపిక్ గా వచ్చింది. చింతకింది మల్లేశం చీరెలు నేయడానికి ఆసు అనే యంత్రాన్ని కనుగొని చేనేత కార్మికులనుభవిస్తున్న బాధల నుంచి విముక్తి కల్గించాడు. ఇందుకుగాను 2017 లో ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డు వరించింది . ఒక పోచంపల్లి చీర నేయడానికి దారాన్ని పిన్నుల చుట్టూ 9 వేల సార్లు అటూ ఇటూ తిప్పాలి. ఇలా రోజుకి 18 వేల సార్లు దారాన్ని కండెల చుట్టూ తిప్పితే గానీ రెండు చీరలు తయారుకావు. దారాన్ని కండెల చుట్టూ తిప్పుతూంటే మల్లేశం తల్లి చేతులు బాగా లాగుతూ వుండేవి. ఆమె భుజం నొప్పితో రోజంతా బాధపడుతూంటే చూడలేక చీరలు నేయడాన్ని యాంత్రీకరణ చేయాలనుకున్నాడు. ఫలితంగా ఏడేళ్ళు కష్టపడి 2000 లో తల్లి పేరుతోనే లక్ష్మీ ఆసు యంత్రాన్ని రూపొందించాడు. దీంతో అతడికి దేశవ్యాప్తంగానే కాదు, అంతర్జాతీయంగానూ గుర్తింపు వచ్చింది. ఈ యంత్రాన్ని కనుగొని వుండక పోతే పోచంపల్లి చేనేత పరిశ్రమ ఎప్పుడో మూతబడేది.

ఈ నిజ జీవిత కథని తెరకెక్కించి నప్పుడు ఆర్ట్ సినిమా పంథా చేపట్టారు. ఆర్ట్ సినిమా కాకుండా దీన్నింకో దృక్కోణంలో ప్రత్యామ్నాయం ఆలోచించే అవకాశం లేనంతగా ముద్ర కొట్టి వదిలారు. కమర్షియల్ గా ఎంత సక్సెస్ అవుతుందనేది తర్వాతి సంగతి, తెలంగాణా ఆర్ట్ సినిమాగా మాత్రం దేశంలో కమర్షియల్ బాట పట్టిన ఇతర ప్రాంతీయ సినిమా రంగాలని ఆలోచనలో పడేసే అనివార్య పరిస్థితిని మాత్రం కల్పిస్తోంది. ఇది బయోపిక్ కావడం వల్లే సాధ్యమైంది.

ఎవరెలా చేశారు

కమర్షియల్ సినిమాల్లో హాస్య పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న ప్రియదర్శి, ఈ వాస్తవిక పాత్ర నటించేందుకు ముందుకు రావడమే బయోపిక్ కి మొదటి బలం. ప్రతీ దృశ్యాన్నీ కెమెరాకి ప్రదర్శించాలనో, ప్రేక్షకులకి ప్రదర్శించుకోవాలనో యావతో కాక – ఈ రెండిటి స్పృహ లేనట్టే పాత్రలో కెళ్ళిపోయి అన్ కాన్షస్ గా ప్రవర్తించాడు. అతను నటించలేదు, ప్రవర్తించాడు. తను చెక్కతో చేసిన యంత్రాన్ని తండ్రి తగులబెట్టినప్పుడు తట్టుకోలేక గుండెలు పగిలేలా ఏడ్చే దృశ్యాన్ని గుర్తుండి పోయేలా నిలబెట్టాడు. ప్రతీ షాట్ నీ ప్రియదర్శి సద్వినియోగం చేసుకున్నాడు. మొదట నేస్తాలతో ఖాళీగా తిరగడం కాడ్నుంచి తల్లిదండ్రులకి కొడుకుగా, భార్యకి భర్తగా, పుట్టిన బిడ్డకి తండ్రిగా…మామూలుగా లేదు అతడి బహురూప ప్రవర్తనా విలాసం.

తల్లిగా నటించిన ఝాన్సీ కిది గుర్తుండిపోయే పాత్ర, నటన. సెకండాఫ్ లో వయసు మీద బడ్డాక బక్క చిక్కినట్టున్న ఫిజిక్ తో, కళ్ళద్దాలు పెట్టుకుని పాత్రకి మరీ దైన్యాన్ని దోచి పెట్టింది. ఎక్సెలెంట్ పెర్ఫార్మెన్స్. ఇక మల్లేశం భార్యగా అనూషా నాగళ్ల తెలంగాణా తనంతో తొణికిసలాడింది. మల్లేశం ఫ్రెండ్స్ ఇద్దరూ తెలంగాణా పోరగాళ్ళని కళ్ళెదుట నిలబెట్టారు. మల్లేశం తండ్రిగా చక్రపాణి, హైదరాబాదో మల్లేశంకి ఎలక్ట్రికల్ పని ఇప్పించే నటుడు (పేరు తెలీదు), యంత్రం తయారీకి మల్లేశంకి సాయపడే అబ్దుల్ అనే పాత్రలో నటుడు (పేరు తెలీదు), వూళ్ళో మల్లేశం కనుగొనే యంత్రం పట్ల ఆసక్తితో వుండే వృద్ధుడు (పేరు తెలీదు), కామెడీ మాటలతో నవ్వించే లింగవ్వ పాత్రలో నటి (పేరు తెలీదు)…ఇలా ఒకరనేమిటి, ప్రతీ ఒక్కరూ కెమెరా ముందు నటిస్తున్నట్టు గాక, సహజాతి సహజమైన తెలంగాణ మనుషులుగా కన్పిస్తారు.

మార్క్ రాబిన్ మ్యూజిక్ ఒక ప్లస్. శాండిల్యస కెమెరా వర్క్ కూడా. ఏలే లక్ష్మణ్ కళా దర్శకత్వం కూడా. పెద్దింటి అశోక్ కుమార్ తెలంగాణా మాటలు అందరికీ అర్థమయ్యే లాగా వున్నాయి. తెలంగాణాలో జిల్లాకో మాండలికం వుంటుంది. ఒక జిల్లాలో కొన్ని మాటలు ఇంకో జిల్లాలో అర్ధంగావు. తెలంగాణా సినిమాలు తీసినప్పుడు అత్యుత్సాహంతో ఏ జిల్లాకి చెందినవాళ్ళు ఆ మాటలు నిఘంటువుల్లో వెతికి మరీ పెట్టుకుని సంబర పడుతున్నారు గానీ, అవి ఇతర జిల్లాల వారికి అర్ధం గావడం లేదు. ఈ పరిస్థితి ‘మల్లేశం’తో లేకపోవడం చాలా ప్లస్.

లొకేషన్స్, ఇళ్ళు నాటి కాలాన్ని తలపించేవిగా వున్నాయి. హైదరాబాద్ ని కూడా ఎక్కడా ప్రముఖ ప్రాంతాలు చూపకుండా ఇరుగు గల్లీలకే పరిమితం చేశారు. ఎక్కడా రిచ్ నెస్ ని చూపలేదు. గ్రామాన్ని చూపినట్టే హైదరాబ్ లో అలాటి దిగువ తరగతి లొకేషన్స్ ని చూపిస్తూ విజువల్  ఏకత్వాన్ని పోషించారు.

చివరికేమిటి

కొత్తగా దర్శకత్వం చేపట్టిన సహనిర్మాత రాచకొండ రాజ్ మంచి ప్రతిభ కనబర్చాడు. ముఖ్యంగా జానర్ మర్యాద విషయంలో. ఎక్కడా మాస్ ఎలిమెంట్స్ జొరబడనీయ లేదు. కమర్షియల్ హంగుల కోసం ప్రాకులాడ లేదు. షాట్స్ తో వాస్తవిక సినిమా కళారీతుల్నిగొప్పగా చిత్రించ లేకపోయినా, సాదా సీదా చిత్రీకరణలతోనే బలమైన డ్రామాగా గల సన్నివేశాల సృష్టి చేశాడు. అవసరమైన చోటల్లా సున్నిత హాస్యాన్ని ఒలికించాడు. ఆర్టు సినిమాగా తీసినా, ఏదో ఇష్టానుసారం తీసుకుంటూ పోకుండా, త్రీ యాక్ట్ స్ట్రక్చర్ లో స్క్రీన్ ప్లే చేశాడు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని, పద్మశ్రీ చింతకింది మల్లేశం విజయగాథ పట్ల గౌరవంతో కూడా, దీనికి రేటింగ్ 4 / 5 ఇవ్వడం న్యాయం. ‘కేరాఫ్ కంచరపాలెం’ తర్వాత, ఒక నిజాయితీతో తీసిన ప్రయోజనకర వాస్తవికం ‘మల్లేశం’.

రచన –  దర్శకత్వం:  రాచకొండ రాజ్
తారాగణం :  ప్రియదర్శి, అనూషా నాగళ్ల, ఝాన్సీ, చక్రపాణి, తిరువీర్, జగదీష్ ప్రతాప్ భండారీ, అన్వేష్ మైకేల్ తదితరులు
మాటలు : పెద్దింటి అశోక్ కుమార్, సంగీతం : మార్క్ రాబిన్, ఛాయాగ్రహణం : బాలూ శాండిల్యస
నిర్మాతలు : రాచకొండ రాజ్, శ్రీ అధికారి
విడుదల : జూన్ 21, 2019
4 / 5

―సికిందర్

<

p style=”text-align: justify;”>