క్వశ్చన్ మార్కు స్పై భక్తి – ‘వార్’ మూవీ రివ్యూ!
యాక్షన్ సినిమాలు తగ్గి స్పై థ్రిల్లర్స్ పెరుగుతున్నాయి. రోమియో అక్బర్ వాల్టర్, నామ్ షబానా, రాజీ, టైగర్ జిందా హై… ఇప్పుడు ‘వార్’. ఈసారి ఇద్దరు సీనియర్, జూనియర్ యాక్షన్ స్టార్స్ హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ లతో డిఫరెంట్ స్పై థ్రిల్లర్ ని ప్రయత్నించారు. ప్రయత్నించిన దర్శకుడు ‘సలాం నమస్తే’ ఫేమ్ సిద్ధార్థ్ ఆనంద్. నిర్మించిన బ్యానర్ ప్రసిద్ధ యశ్ రాజ్ ఫిలిమ్స్. ఇది డిఫరెంట్ ఎందుకంటే దీనికి యాక్షనే తప్ప కంటెంట్ పట్టలేదు. అయినా బాక్సాఫీసుని వూపుతోంది. ఇదే కొత్త సక్సెస్ మంత్రమైతే ఇక హాలీవుడ్ యాక్షన్ డైరక్టర్ల మీద ఆధారపడాల్సిందేనా? వాళ్ళు లేని యాక్షన్ సినిమాలు ఇక సాధ్యం కావా? వాళ్ళుంటే ఇక కంటెంట్ అవసరం లేదా? కంటెంట్ లేక హాలీవుడ్ యాక్షన్ తో ‘సాహో’, ‘బందోబస్త్’ లు ఫ్లాపయ్యాయి. కంటెంట్ లేని యాక్షన్ తో ఎప్పుడో అదృష్టవశాత్తూ ‘వార్’ లాంటి అద్భుతాలు జరుగుతాయా? పరిశీలిద్దాం…
కథ
‘రా’ – రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్ (భారత రహస్య గూఢచార సంస్థ) ఏజెంట్ ఖాలిద్ రెహ్మానీ (టైగర్ ష్రాఫ్) కి, ‘రా’ కి విరోధిగా మారిన ఏజెంట్ కబీర్ లూథ్రా (హృతిక్ రోషన్) ని చంపమని ఆపరేషన్ని అప్పజెప్తాడు ‘రా’ చీఫ్ కల్నల్ లూథ్రా (ఆశుతోష్ రాణా). ఖాలిద్ కబీర్ కింద పని చేసిన జూనియర్. గతంలో ‘రా’ మాజీ ఏజెంట్ అయిన ఖాలిద్ తండ్రి శత్రువులతో చేతులు కలిపి దేశ ద్రోహం చేశాడు. కబీర్ అతణ్ణి వెతికి పట్టుకుని చంపేశాడు. భర్త వల్ల కుటుంబం మీద పడ్డ దేశద్రోహం మచ్చకి ఖాలిద్ తల్లి (సోనీ రాజ్దాన్) వేదనతో వుంది. ఈ మచ్చని రూపుమాపాలని పట్టుదలతో ఖాలిద్ ‘రా’ లో ఏజెంట్ గా చేరాడు. దీంతో అడుగడుగుబా అతడి నిజాయితీ, దేశ భక్తీ పరీక్ష నెదుర్కొంటున్నాయి. నిరంతరం వీటిని నిరూపించుకునే పనిలో వున్నాడు. ఇప్పుడు తన సీనియర్ని వెతికిపట్టుకుని చంపే బాధ్యత మీద పడింది. ఈ బాధ్యత నెరవేర్చగలిగాడా? తన దేశభక్తిని ఎలా నిరూపించుకుని కుటుంబం మీద పడ్డ మచ్చని తొలగించుకోగలిగాడు? అసలు కబీర్ తను పనిచేసే ‘రా’ కి ఎందుకు విరోధిగా మారాడు? అలా మారి అతనేం చేస్తున్నాడు? విదేశంలో వుంటున్న క్రిమినల్ బిజినెస్ మాన్ రిజ్వాన్ ఇలియాసీ (సంజీవ్ వాస్త) తో కబీర్ కేం సంబంధం? ఫేషియల్ సర్జరీలు చేసే డాక్టర్ మల్లికా సింఘాల్ (దీపాన్నితా శర్మ) ఎలా ఇలియాసీతో ఇన్వాల్వ్ అయింది? ఇంకో ‘రా’ ఏజెంట్ సౌరభ్ ఎందుకు రిజ్వాన్ పక్షాన చేరాడు? వీటన్నిటి నేపథ్యంలో బద్ధ శత్రువులైన కబీర్ – ఖాలిద్ ల మధ్య వార్ ఎలాముగిసింది? ఇదీ మిగతా కథ.
ఎలావుంది కథ
ఈ స్పై జానర్ కథ చివర్లో కబీర్ పాత్ర చెప్పినట్టు ఖాలిద్ పాత్రది, ఈ వార్ కి హీరో అతనే. ఇలా ఈ సారి స్పై జానర్ కథని ఈ వర్గం పాత్ర దేశభక్తిని నిరూపించేందుకు వినియోగించారు. అరడజను హిందీ సినిమాల్లో ఈ వర్గం పాత్ర దేశ భక్తిని నిరూపించి నిరూపించి వున్నారు. ఇంకా పరీక్షించి నిరూపించాలి. బాలీవుడ్ రచయిత జావేద్ అఖ్తర్ దేశభక్తిని ఒక మోడీ భక్తురాలైన యాంకర్ ప్రశ్నించినప్పుడు, ఎవరేం అనుకున్నా దేశంతో తనకున్న ప్రేమ అంగుళం కూడా చెక్కు చెదరదనేసి చప్పట్లు మోగించుకున్నాడు పబ్లిక్ సభలో. జనాభాకి రెచ్చగొడితే ఎన్నికల్లో తప్ప, సినిమాల్లో దేశభక్తి సమస్యే కాదు. అయినా నార్త్ మీడియాలో, బాలీవుడ్ లో ఈ వర్గం దేశభక్తి అమ్ముడయ్యే ఫార్ములాగానే భావిస్తున్నారు. గతంలో ఈ పాత్రలు హీరో పాత్ర కోసం ప్రాణాలర్పించే పాత్రలుగా వుండేవి. ఇప్పుడు దేశం కోసం ప్రాణాలర్పిస్తేనే దేశ భక్తి అన్నట్టుగా చూపిస్తున్నారు. జనాభాలో కొద్ది శాతం మంది కోసం ఎవ్వరూ దేశభక్తిని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. మార్కెట్ కి అవసరం లేని ఈ భావజాలం అనవసరంగా ప్రేక్షకుల మీద రుద్దడమే. ఈ విధంగా ఈ కథకి కథా ప్రయోజనమంటూ ఏమీ లేదు. చివరికి ఖాలిద్ కి మరణానంతర మెడల్ ని అతడి తల్లికి ‘ప్రధాని నరేంద్ర మోడీ’ అందిస్తున్నట్టు ముచ్చటైన ఓదార్పు ముగింపు! దేశంలో ఒక వర్గాన్ని నెగెటివ్ గా చూపడంలో దూకుడు పెరుగుతూంటే, వాస్తవ దూరంగా ఈ కథ.
ఈ కథతో మౌలిక సమస్య ఒకటుంది. ఇంతా చేసి దేశభక్తి నిరూపించుకోవాల్సిన పాత్ర అనుమానాస్పదంగా వుంది. కబీర్ ని చంపమని బాస్ అప్పగించిన పనిని దేశం కోసం డ్యూటీగానే ఖాలిద్ చేస్తున్నాడా, లేక కబీర్ తన తండ్రిని చంపాడన్న పగతో చేస్తున్నాడా అన్న కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సమస్య తలెత్తింది. తండ్రి వల్ల పడ్డ దేశద్రోహం మచ్చ తొలగించుకోవడానికే ‘రా’ లో చేరినప్పుడు, ఆ దేశ ద్రోహి తండ్రిని చంపిన వాణ్ణి చంపాల్సి వస్తే, అది దేశభక్తి నిరూపణ కోసమే చేస్తున్నట్టు ఎలా నమ్మాలి? ఇంకో హఫీజ్ సయీద్ నో, దావూద్ ఇబ్రహీంనో చంపడానికి బయల్దేరితే అది దేశభక్తి అని నమ్మొచ్చు గాని?
ఈ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వ్యక్తిగత పగ – దేశ భక్తిలతోనే కాదు, ఇంకా కలగాపులగం చేస్తూ గురుశిష్య సంబంధంతోనూ వుంది. ఖాలిద్ జూనియర్, కబీర్ శిక్షణ నిచ్చిన సీనియర్. గురువుగార్ని చంపడానికి మనసెలా ఒప్పుతుంది. ఒకవేళ చంపినా దేశం కోసమా, పగకోసమా?
గత వారం ‘అర్బన్ నక్సల్’ ఆరోపణలు ఎదుర్కొంటున్న హక్కుల కార్యకర్త గౌతమ్ నవ్లఖా కేసు విచారించడానికి ఒకరి తర్వాత ఒకరు ఐదుగురు సుప్రీం కోర్టు జడ్జీలు నిరాకరించారు. కారణాలు చెప్పలేదు. వాళ్ళలో ఒక జడ్జికి కాన్ఫ్లిక్ ఆఫ్ ఇంట్రెస్ట్ సమస్య ఎదురైనట్టుందని అనుకున్నారు. ఆయన గతంలో నవ్లఖా తరపున లాయర్ గా ఒక కేసు వాదించాడు. కనుక ఇప్పుడు జడ్జిగా కేసు విచారిస్తే అధికారాన్నుపయోగించుకుని వ్యక్తిగత ప్రయోజనాలు నెరవేర్చుకున్నట్టుగా అవుతుందని (కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్), అందువల్ల కేసు తిరస్కరించి వుంటారని భావించారు.
ఖాలిద్ పాత్ర కూడా ఈ సిట్యుయేషన్లోనే వుంది. ఇతడికి ‘రా’ చీఫ్, కబీర్ ని చంపే డ్యూటీ వేయనేకూడదు. వేస్తే ఖాలిద్ పగతో, దేశంతో, శిష్యరికంతో కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కారణం చెప్పి తిరస్కరించాలి. అలా చేస్తే ఈ కథే వుండదు. కనుక ఈ కామన్ సెన్సుని చంపి, అంటీ ముట్టని పాత్రలతో అంటీ ముట్టని కథ నడిపేశారు. బుద్ధి జీవులకైతే ఖాలిద్ ‘రా’ ఏజెంటుగా అవకాశం దొరికిందని, వ్యక్తిగత పగతోనే గురువు కబీర్ ని చంపడానికి వెంట పడివుంటాడేమో అన్పిస్తుంది, దేశభక్తితో కాక. ఇలా ఇది క్వశ్చన్ మార్కు కన్ఫ్యూజుడు స్పై భక్తి కథగా తయారయ్యింది.
ఎవరెలా చేశారు
హృతిక్ రోషన్ – టైగర్ ష్రాఫ్ ఇద్దరూ బద్ధశత్రువులుగా నువ్వా నేనా అన్నట్టు, హాట్ హాట్ హైటెక్ యాక్షన్ సీన్స్ తో రోమాంచితంగా హైలైట్ అయ్యారు. ఇద్దరు పాపులర్ యాక్షన్ స్టార్లు ఒకే తెరమీదికొచ్చి విలన్స్ లా పదేపదే కొట్టుకుంటూ వుంటే, ఎగురుతున్న విమానం రెక్కమీదికి దూకి రజనీకాంత్ కి కూడా రాని అయిడియాలు ప్రదర్శిస్తూ, ఇంకో ఎగురుతున్న విమానం మీదికి దూకి, లోపలికి జొరబడి లడాయి మొదలుపెట్టుకుంటే. ప్రమాదకరమైన ఫారిన్ ఘాట్ రోడ్స్ మీద హై ఎండ్ పవర్ బైక్స్ మీద ఛేజింగులు చేసి పడేసి కొట్టుకుంటే – వుండే మజా ఇంకెందులోనూ లేదు. ఇలా బాగాలేని కథ రాసిన కాగితాలు ఎటెటో ఎగిరిపోయి పీడా విరగడైంది. కాగితాలు పనికిరాకపోతే కుమ్ములాటలైనా పనికిరావాలి బాక్సాఫీసుకి.
ఇద్దరు సీనియర్, జూనియర్ సిక్స్ ప్యాక్ యాక్షన్ స్టార్స్ ని ఒకరికొకర్ని యాంటీగా సెట్ చేసి, దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ఆడిన పేకాట, ఇంటర్ ప్లే, పైరో డైనమిక్స్, జంబో ఎనర్జిటిక్స్, హైపవర్ ఎర్గోనమిక్స్ వగైరా వగైరాలతో కూడిన యాక్షన్ డైనమిక్స్ – ఇవే ఈ 200 కోట్ల మెగా బడ్జెట్ ప్రొడక్షన్ ని బంపర్ బాక్సాఫీసు బొనాంజాగా ప్రేక్షకులకి అమ్మేశాయి పండగ రోజుల్లో పానిండియా మూవీగా, పాన్ మసాలాగా. ఇద్దరు స్టార్స్ మీద ‘జైజై శివ శంకర్’ మాస్ సాంగ్ మత్తులో వూగించే ఇంకో జోడా బైల్ టుబాకో మసాలా.
హాలీవుడ్, కొరియన్, ఇండియన్ స్టంట్ డైరెక్టర్స్ (పాల్ జెన్నింగ్స్, ఫ్రాంజ్ సిల్ఫస్, సీ యంగ్, పర్వేజ్ షేక్) యాక్షన్ ని వినూత్నంగా ఫాంటసీగా మార్చేసి జనరంజకం చేశారు. ఈ యాక్షన్ హంగామాలో ఇద్దరు హీరోయిన్లు వాణీ కపూర్, అనుప్రియా గోయెంకాలకి ఆనవాయితీగానే, సహజాతి సహజంగానే అరగంట మేర పాత్రలు దక్కలేదు. విలన్స్ కి ప్రాధాన్యంలేదు. హీరోలే ఒకరికొకరు విలన్స్ కాబట్టి.
కెమెరా మాన్ బెన్ జాస్పర్ కలర్ఫుల్ విజువల్స్ గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు. ఆరీఫ్ షేక్ ఎడిటింగ్ మాత్రం సెకండాఫ్ లో చాలా సేపు మందగించిన నడకతో సమస్య నెదుర్కొంది. విశాల్ – శేఖర్ సంగీతంలో పాటలు హిందీకే గానీ, తెలుగు డబ్బింగ్ కి మెప్పించేవిగా లేవు. ఇక రాసిన కాగితాలు ఇంకెంతగా పనికిరాలేదంటే, అబ్బాస్ టైర్ వాలా డైలాగులు యాక్షన్ మూవీ జానర్ కి తగ్గట్టుగా చిల్లీ పెప్పర్ గా లేవు. డైలాగ్ పార్టుని ఫిలాసఫీ ఆక్రమించింది. 120 సినిమాలు రాసిన ఈ దర్శకుడి తాత ది ఫేమస్ ఇందర్ రాజ్ ఆనంద్, అమితాబ్ బచ్చన్ మాస్ సినిమాలకి రాసిన డైలాగులు ఇప్పటికీ ఫేమసే.
చివరికేమిటి
అర్ధంలేని రైటింగ్ కి అర్ధమయ్యే షూటింగ్ చేసి ఒక విచిత్రమైన పరిస్థితి సృష్టించారు. సక్సెస్ కి రైటింగ్ కాదు, షూటింగ్ అని రిస్కీ గేమ్ ఆడారు, ఇద్దరు వైబ్రెంట్ స్టార్స్ ని యాంటీగా పెట్టడమే సెల్లింగ్ పాయింట్ అవుతుందనీ, వాళ్ళ మధ్య గ్రేట్ యాక్షన్ కి కథతో పనిలేదనీ అన్నట్టుగా బాక్సాఫీసుకి సవాలు విసిరారు. దీనికి తగ్గట్టుగానే 300 నుంచి 350 కోట్లు ముట్టజెప్పేందుకు బాక్సాఫీసు సిద్ధంగా వుంది. మొదటి రోజు కలెక్షన్స్ తోనే అన్ని హిందీ సినిమాల రికార్డుల్ని బ్రేక్ చేసింది. కేవలం నాల్గురోజుల్లో ఓవర్సీస్ కలుపుకుని 216 కోట్లతో అపూర్వ రికార్డు సృష్టించింది.
ఇక రైటింగ్ గురించి రివ్యూలేం రాస్తారు. రైటింగ్ లో పైన చెప్పుకున్న కాన్సెప్ట్ పరమమైన లోపాలతో బాటు, ఇంకా గతంలో ఖాలిద్ తండ్రిని చంపిన కబీర్, దేశంకోసం పనిచేస్తున్నశిష్యుడైన ఖాలిద్ ని శత్రువుగా చూసి, తన్నడంలో కబీర్ పాత్రకి కూడా జస్టిఫికేషన్ లేకపోవడం, అసలు కబీర్ ఎందుకు ‘రా’ కి వ్యతిరేకంగా మారాడో చెప్పకపోవడం, బేసిగ్గా కబీర్ – ఖాలిద్ లని యాంటీగా సెట్ చేయడంలో ఎలాటి లాజిక్ లేకపోవడం, సెకండాఫ్ లో సస్పెన్స్ కోసం ఖాలిద్ కి పెట్టిన ట్విస్టు ఒక లక్ష్యంతో కొనసాగుతున్న అతడి పాత్ర ప్రయాణాన్ని ఆపేసేలా వుండడం, ఉన్నట్టుండి కేరళలో పెళ్లి సీను పెళ్లి సినిమా చూస్తున్నట్టు జానర్ మర్యాద తప్పడం …ఇలా ఎక్కడికక్కడ పాత్రల్నీ, కథనీ కిల్ చేస్తున్న కంటెంట్ కి రివ్యూ రాయడంలో అర్ధమే లేదు. సిద్ధార్థ్ ఆనంద్ – శ్రీధర్ రాఘవన్ ల స్క్రీన్ ప్లే ఒక బ్లండర్ బాజీ. అదృష్టవశాత్తూ కేవలం షూటింగ్ తో సక్సెస్ ప్రూవయింది. రైటింగ్ కి సెండాఫ్ ఇద్దాం.
దర్శకత్వం : సిద్ధార్థ్ ఆనంద్
తారాగణం : హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్, వాణీ కపూర్, అనుప్రియా గోయెంకా, దీపాన్నితా శర్మ, సోనీ రాజ్దాన్, ఆశుతోష్ రాణా తదితరులు
కథ : ఆదిత్యా చోప్రా, సిద్ధార్థ్ ఆనంద్; స్క్రీన్ ప్లే : సిద్ధార్థ్ ఆనంద్, శ్రీధర్ రాఘవన్; మాటలు : అబ్బాస్ టైర్ వాలా, సంగీతం : విశాల్ – శేఖర్, ఛాయాగ్రహణం : బెన్ జాస్పర్
బ్యానర్ : యశ్ రాజ్ ఫిలిమ్స్
నిర్మాత : ఆదిత్యా చోప్రా
3 / 5
-సికిందర్