సూర్యతో పనిచేయడం ఓ థ్రిల్‌: బాబీ డియోల్‌

28 ఏళ్ల తర్వాత ‘యానిమల్‌’తో సూపర్‌ హిట్‌ అందుకున్నారు బాబీ డియోల్‌ . ప్రస్తుతం ఆయన వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. అటు తమిళం, ఇటు తెలుగు చిత్రాలతో ముందుకెళ్తున్నారు. తెలుగులో ‘హరిహర వీరమల్లు’తోపాటు బాలకృష్ణ చేయబోయే ఓ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమిళంలో సూర్య నటిస్తున్న ‘కంగువా’లో విలన్‌ గా కనిపించనున్నారు.

తాజాగా ఈ సినిమాలోని తన పాత్ర గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు బాబీ దేవోల్‌. ‘కంగువా’ కథ, అందులో నా పాత్ర బాగా నచ్చింది. ఇక చిత్ర బృందం అయితే ఎప్పటికీ గుర్తుండిపోతుంది. సూర్య నటన అద్భుతంగా ఉంటుంది. అలాంటి అంకితభావం ఉన్న నటుడితో పని చేయడం ఆనందంగా ఉంది. తమిళంలో నా తొలి చిత్రమిది. ఇప్పటి దాకా ఈ తరహా పాత్ర చేయలేదు. ఇందులోనేను చేస్తున్న పాత్ర నా కంఫర్ట్‌ జోన్లో లేదు. ఎందుకంటే నాకు ఈ భాష తెలియదు. రెండు నెలల్లో తమిళం నేర్చుకోలేను’ అని అన్నారు.

కంగ అనే ఓ పరాక్రముడి కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో సూర్య ఆరు భిన్నమైన అవతారాల్లో కనిపించనున్నారు. శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. 38 భాషల్లో విడుదల చేయడానికి మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు. ఐమ్యాక్స్‌, 3డీ వెర్షన్‌లోనూ ఇది అందుబాటులో ఉండనుంది. దిశా పఠానీ కథానాయికగా నటిస్తుండగా..వచ్చే ఏడాది వేసవి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.