టాలీవుడ్‌లో ప్రొడక్షన్ హౌస్‌ల పోటీ రోజురోజుకు పెరుగుతున్నా, మైత్రీ మూవీ మేకర్స్ మాత్రం తనదైన స్టైల్‌లో కొనసాగుతోంది. స్టార్ హీరోలతో వరుస సినిమాలను లైన్‌లో పెట్టే మైత్రీ, 2025-26లో ఇండస్ట్రీని షేక్ చేయనున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా, తెలుగులోనే కాకుండా కోలీవుడ్, బాలీవుడ్‌లో కూడా అడుగుపెడుతూ భారీ సినిమాలను నిర్మిస్తోంది. పుష్ప 2 వంటి బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌ను హ్యాండిల్ చేసిన ఈ సంస్థ, రాబోయే రెండు సంవత్సరాల్లో మరింత క్రేజీ లైనప్‌ను సిద్ధం చేస్తోంది.
2025 మార్చిలో నితిన్, వెంకీ కుడుముల కాంబోలో తెరకెక్కుతున్న ‘రాబిన్ హుడ్’తో ప్రారంభమయ్యే మైత్రీ బ్లాక్‌బస్టర్ సీజన్, ఏప్రిల్‌లో రెండు బిగ్ సినిమాలతో కొనసాగనుంది. సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని కాంబోలో తెరకెక్కుతున్న ‘జాట్’, అజిత్ నటిస్తున్న ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ఏప్రిల్ 10న విడుదలకు సిద్ధమవుతున్నాయి. మరోవైపు, రామ్ చరణ్ – బుచ్చిబాబు ప్రాజెక్ట్ RC16 కూడా 2025లోనే విడుదల కానుంది.
ఇక ప్రభాస్, హను రాఘవపూడి ప్రాజెక్ట్ 2025లో ప్రేక్షకుల ముందుకు రానుండగా, పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రాజెక్ట్ 2026లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు, ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ మూవీ 2026 సంక్రాంతికి విడుదల కానుంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జై హనుమాన్’ సినిమా కూడా అదే ఏడాది రానుండటంతో, మైత్రీ ప్రాజెక్టుల బిగ్ లైనప్‌కు మరింత శక్తి వచ్చింది.
నాని – సీబీ చక్రవర్తి మూవీ, రామ్ చరణ్ – సుకుమార్ ప్రాజెక్ట్, చిరంజీవి – బాబీ కొల్లి సినిమాలు 2026లో షూటింగ్ ప్రారంభించనున్నట్లు టాక్. ఇలా చూస్తే, మైత్రీ మూవీ మేకర్స్ టాలీవుడ్‌లో అగ్రస్థానాన్ని మరింత బలపరుచుకునేలా ఉంది. భారీ ప్రాజెక్టులతో దూసుకెళ్తున్న ఈ సంస్థ, బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ విజయాలు సాధిస్తుందో చూడాలి.