మొన్నేమో క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీ నుంచి లోక్ సభకు పోటీ చేస్తాడనే ప్రచారం జరిగింది. ఆయన వైసీపీలో చేరాడు, ఆ తర్వాత వైసీపీకి రాజీనామా చేశాడు కూడా. జనసేనతో ఆ తర్వాత టచ్‌లోకి వెళ్ళాడు అంబటి రాయుడు. అయితే, ఇంకా జనసేనలో ఆయన చేరలేదు.
ప్రస్తుతం ఏదో క్రికెట్ లీగ్ ఆడుతున్నాడు. అది పూర్తయ్యాక, మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చి, జనసేన నుంచి లోక్ సభకే అంబటి రాయుడు పోటీ చేస్తాడన్న ప్రచారం జరుగుతోంది. ఇంకోపక్క, సినీ దర్శకుడు వీవీ వినాయక్ ఏలూరు ఎంపీగా వైసీపీ నుంచి పోటీ చేస్తాడంటూ వైసీపీ అనుకూల మీడియాలో వార్తలు దర్శనమిచ్చాయి.
వినాయక్ అంటే మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని. జనసేనాని పవన్ కళ్యాణ్‌తోనూ అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. అయితే వినాయక్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీతో సన్నిహిత సంబంధాలుండటమే కాదు, వైసీపీతో ఇంకా ప్రత్యేకమైన అనుబంధం వుంది.
కానీ, ఇంతవరకు రాజకీయాలపై వివి వినాయక్ ఎక్కడా పెదవి విప్పలేదు. తాజాగా, లిస్టులోకి సినీ నటుడు సుమన్ పేరు వచ్చి పడింది. రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా వైసీపీ తరఫున సుమన్ ఎన్నికల బరిలోకి దిగుతారన్నది తాజా ఖబర్.
ఒకప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హల్‌చల్ చేద్దామని సుమన్ అనుకున్నమాట వాస్తవం. కానీ, అదంతా జస్ట్ మీడియా హడావిడిగానే మిగిలిపోయింది. సుమన్ చాలా సీరియస్‌గా పొలిటికల్ స్టేట్మెంట్లు ఇచ్చేస్తాడు, ఆ తర్వాత సైలెంటయిపోతాడు.
నిజానికి, సుమన్ గత కొంతకాలంగా జనసేనకి అనుకూలంగానే మాట్లాడుతూ వచ్చాడు. మరిప్పుడు, ఆయన వైసీపీలో చేరతాడా.? వైసీపీ ఆయనకు టిక్కెట్ ఇస్తుందా.? కాస్త ఆలోచించాల్సిన విషయమే ఇది.