ఇండియన్ సినిమా చరిత్రలో స్థాయివంతమైన చిత్రాల్లో ఒకటైన నాయగన్ తరువాత, మణిరత్నం-కమల్ హాసన్ కాంబినేషన్ మళ్లీ వస్తోంది. థగ్ లైఫ్ పేరుతో ఈ భారీ ప్రాజెక్ట్ జూన్ 5న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. అయితే ఈ సినిమాకు మూలకథ ఎవరిది అనే ప్రశ్నకు స్వయంగా మణిరత్నమే సమాధానం ఇచ్చారు.
తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో మణిరత్నం మాట్లాడుతూ, ఈ కథ కమల్ హాసన్ రాసిన ‘అమర్ హై’ అనే స్క్రిప్టు నుంచీ వచ్చిందని తెలిపారు. ఆ స్క్రిప్టులో ఉన్న ఓ ప్రధాన పాయింట్ తనకు బాగా నచ్చిందనీ, అదే ఆధారంగా నాయగన్ శైలిలో కొత్తదనంతో కూడిన ట్రీట్మెంట్ ఇచ్చి థగ్ లైఫ్ను రూపొందించినట్లు వివరించారు. “కథకీ క్రెడిట్ కమల్ హాసన్‌కే. నేను దాన్ని సినిమాగా సిద్ధం చేశా,” అని మణిరత్నం స్పష్టంగా చెప్పారు. అంటే, ఈ సినిమా కమల్ నటనతోనే కాదు.. కథతోనూ ఓ ప్రధాన బలం అనిపించబోతోంది.
ఇప్పటికే కమల్ కథలు, దర్శకత్వాలకు మంచి గుర్తింపు ఉంది. హేరామ్, విశ్వరూపం, ఉత్తమ విలన్ వంటి సినిమాల్లో ఆయన రైటర్‌గా చాకచక్యాన్ని ప్రదర్శించారు. ఇప్పుడు థగ్ లైఫ్లో మళ్లీ ఆ ప్రతిభను మణిరత్నం శైలిలో చూస్తున్నాం. ఈ సినిమాలో శింబు, త్రిష, జోజు జార్జ్, నాజర్ కీలక పాత్రల్లో నటించారు. కమల్ ,మణిరత్నం ఇద్దరూ కలిసి నిర్మించిన ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ‘నాయగన్’ ఛాయలతో వస్తున్న ఈ కథ, ప్రేక్షకుల హృదయాలను తాకేలా ఉందని చిత్రబృందం ధీమా వ్యక్తం చేస్తోంది.