ఆస్కార్ బరిలో విద్యాబాలన్ నట్కట్.. అందరి చూపు ఈ చిన్న సినిమా మీదే ..!

ఆస్కార్ బరిలో ఒక సినిమా గాని లేదా షార్ట్ ఫిలింస్ గాని నామినేట్ అవడం అంటే అంత సులభం కాదు. అలాంటిది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ నటించిన ‘నట్కట్’ అన్న షార్ట్ ఫిల్మ్ ఆస్కార్ బరిలో నిలవబోతోంది. విద్యాబాలన్ ఎలాంటి పాత్రలకైనా సై అంటుంది. పక్కా ప్రొఫెషనల్ గా ఉండే విద్యాబాలన్ పాత్ర కోసం ఎంతటి రిస్క్ అయినా చేస్తుంది. బయోపిక్స్ లో నటించడానికి .. బోల్డ్ క్యారెక్టర్స్ చేయడానికి ఎప్పుడూ ముందు ఉంటుంది. అందుకే బాలీవుడ్ లో విద్యాబాలన్ కి ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక మార్కెట్ ఉంది.

లేడీ ఓరియెంటెడ్ సినిమాలకి బాలీవుడ్ లో విద్యాబాలన్ కేరాఫ్ అడ్రస్ గా మారింది. కహానీ, కహానీ 2, బేగం జాన్, తుమ్హారీ సులూ, మిషన్ మంగళ్ లాంటి కథా ప్రాధాన్యం ఉన్న సినిమాలలో నటించి తన ఇమేజ్ ని మరింతగా పెంచుకుంది. ఇక తమిళంలో అజిత్ కుమార్ నటించిన నేర్కొండ పార్వై తో పాటు తెలుగులో నందమూరి బాలకృష్ణ నటించిన ఎన్.టి.ఆర్ బయోపిక్ ఎన్.టి.ఆర్ కథానాయకుడు, ఎన్.టి.ఆర్ మహానాయకుడు సినిమాలలో నటించింది. ఈ సినిమాల ద్వారా విద్యాబాలన్ కి తెలుగు, తమిళ భాషల్లో కూడా అభిమానులను సంపాదించుకుంది.

కాగా 2019 లో విద్యాబాలన్ ‘నట్కట్’ అన్న షార్ట్ ఫిల్మ్ లో నటించింది. విద్యాబాలన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ షార్ట్ ఫిల్మ్ గురించి ప్రేక్షకులు .. ఇండస్ట్రీ వర్గాలు ఎంతో గొప్పగా చెప్పుకున్నారు. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే ఈ షార్ట్ ఫిల్మ్ ఆస్కార్ కి నామినేట్ అవుతుందని మాత్రం ఏ ఒక్కరు ఊహించలేదు. ఇప్పుడు 2021 ఆస్కార్ ఉత్తమ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ఎంపికైంది. నట్కట్ షార్ట్ ఫిల్మ్ లో విద్యాబాలన్ తో పాటు సానికా పటేల్ అనే చైల్డ్ ఆర్టిస్ట్ కూడా నటించింది. కాగా ఈ విషయాన్ని స్వతంగా విద్యాబాలన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఇక ఇప్పటికే నట్కట్ జర్మన్ స్టార్ ఆఫ్ ఇండియా అవార్డును కూడా గెలుచుకుంది. మరి నట్కట్ ఆస్కార్ బరిలో నిలుస్తుందా లేదా చూడాలి.