మంచు ఫాంహౌస్ లో వివాదాస్పద ఘటన.. వీడియో వైరల్

మంచు కుటుంబంలోని తాజా వివాదం నేపధ్యంలో జల్ పల్లి ఫాంహౌస్‌లో చోటుచేసుకున్న సంఘటనపై వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక బౌన్సర్ ఇద్దరు యువకులపై దాడి చేయడం స్పష్టంగా కనిపిస్తోంది. వీడియో చూస్తే, మోహన్ బాబు బయట కుర్చీలో కూర్చుని ఉండగా, చుట్టూ కొందరు వ్యక్తులు నిలబడి ఉన్నారు. బౌన్సర్‌ దాడి చేసిన ఘటనకు సంబంధించిన వీడియో బిల్డింగ్ పై నుంచి చిత్రీకరించినట్లు అనిపిస్తోంది.

దాడి సమయంలో బౌన్సర్‌ యువకుల చెంపపై కొట్టడమే కాకుండా, వారి సెల్‌ఫోన్లు లాక్కున్నాడు. ఈ సంఘటన మోహన్ బాబు కళ్లముందే జరగడం గమనార్హం. చుట్టూ ఉన్నవారిలో ఎవరూ ఆ బౌన్సర్‌ను ఆపలేదు. సెల్‌ఫోన్‌లో వీడియోలు తీసిన కారణంగానే దాడి జరిగినట్లు భావిస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో రావడంతో మోహన్ బాబు ఫాంహౌస్‌ వివాదం మరింత దృష్టిలో పడింది.

వీడియోను ఎవరు తీశారు, ఎలా మీడియాకు చేరింది అనేది ఇప్పటికీ ప్రశ్నగానే మిగిలింది. అసలు ఈ వీడియో రీసెంట్ దేనా లేదంటే పాత వీడియోలు ఇప్పుడు వైరల్ చేస్తున్నారా అనే సందేహం కూడా కలుగుతోంది. ట్విట్టర్ యూజర్‌ సాంబశివారెడ్డి పేరం ఈ వీడియోను షేర్‌ చేయగా, అది వెంటనే వైరల్‌గా మారింది. వీడియోలో ఉన్న అంశాలు మనసును కలిచివేస్తున్నాయి. ఈ ఘటనపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మోహన్ బాబు ఫాంహౌస్‌లో జరిగిన ఈ సంఘటన మంచు కుటుంబానికి కొత్త వివాదాలు తెచ్చిపెట్టేలా ఉంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు వెలుగు చూడాల్సి ఉంది.