ఎన్టీఆర్‌ ‘దేవర’తో పోటీపడనున్న రజనీ ‘వేట్టయాన్‌’… దసరా సందర్భంగా విడుదలకు సిద్దం

అగ్ర కథానాయకుడు రజనీకాంత్ తన రాబోయే సినిమాల అప్‌డేట్స్‌ షేర్‌ చేశారు. ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా హిమాలయాలకు వెళ్లిన ఆయన అక్కడ సాధువులతో సమయం గడుపుతున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో షేర్‌ అవుతున్నాయి.

తాజాగా మీడియాతో మాట్లాడుతూ అప్‌కమింగ్‌ సినిమాలు ‘కూలీ’, ‘వేట్టయాన్‌’లకు సంబంధించిన వివరాలను పంచుకున్నారు. ‘వేట్టయాన్‌’ దసరా కానుకగా అక్టోబర్‌ 10న విడుదల కానుంది. నా పాత్ర షూటింగ్‌ పూర్తయింది. ఇతర నటీనటులకు సంబంధించిన కొన్ని సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. అలాగే లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో ‘కూలీ’ చేస్తున్నా. దాని షూటింగ్‌ జూన్‌ 10 నుంచి ప్రారంభించనున్నారు’ అని తెలిపారు. తన ఆధ్యాత్మిక యాత్ర గురించి మాట్లాడుతూ..’ప్రతి ఏడాది ఇలా యాత్ర చేయడం వల్ల కొత్త అనుభూతి పొందుతాను. అందరికీ ఇలాంటి ప్రయాణం అవసరం. దీనివల్ల ప్రశాంతత లభిస్తుంది. దైవంపై నమ్మకం పెరుగుతుంది’ అన్నారు.

రజనీకాంత్‌ ఈ అప్‌డేట్‌ ఇచ్చిన దగ్గర నుంచి సోషల్‌ విూడియాలో ‘దేవర’ వర్సెస్‌ ‘వేట్టయాన్‌’ చర్చ మొదలైంది. ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘దేవర’. రెండు భాగాలుగా రానున్న ఈ చిత్రం మొదటి పార్ట్‌ను అక్టోబర్‌ 10న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ చిత్రం తమిళంలోనూ విడుదల కానుంది. దీంతో ఆ తేదీన బాక్సాఫీస్‌ వద్ద పోరు ఖాయమంటున్నారు సినీ ప్రియులు. ‘వేట్టయాన్‌’ విషయానికొస్తే.. టి.జె. జ్ఞానవేల్‌ దర్శకత్వంలో తెరకెక్కింది. ఇందులో అమితాబ్‌ బచ్చన్‌, ఫహద్‌ ఫాజిల్‌, రానా, మంజు వారియర్‌, రితికా సింగ్‌, దుషారా విజయన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి.