వరుణ్ తేజ్ డైమండ్ రింగ్ తో ప్రపోజ్?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ గత రెండు రోజుల నుంచి జోరుగా ప్రచారం నడుస్తోంది. జూన్ నెలలో వీరి ఎంగేజ్మెంట్ జరగనుంది అంటూ బాలీవుడ్ లో వినిపిస్తోన్న టాక్. ఈ వార్తను ముందుగా బాలీవుడ్ న్యూస్ వెబ్ సైట్ పింక్ విల్లా పబ్లిష్ చేసింది. అక్కడి నుంచి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అయ్యింది.

ఇదిలా ఉంటే దీనికి కొనసాగింపుగా ఇప్పుడు సదరు వెబ్ సైట్ మరో ఇంటరెస్టింగ్ న్యూస్ రివీల్ చేసింది. ఈ మధ్య బెంగుళూరులో లావణ్య త్రిపాఠి పుట్టినరోజు జరిగిందంట. ఈ బర్త్ డే సెలబ్రేషన్స్ లో వరుణ్ తేజ్ ఖరీదైన డైమండ్ రింగ్ ఇచ్చి లావణ్య త్రిపాఠికి ప్రపోజ్ చేశాడంట. ఇక వరుణ్ తేజ్ ప్రపోజ్ చేయడంతో ఆమె కూడా ఒప్పుకుందని ఈ కథనంలో రాసుకొచ్చారు.

జనవరి నెలలో లావణ్య త్రిపాఠికి వరుణ్ తేజ్ ప్రపోజ్ చేసాడంట. వీరిద్దరూ కలిసి మిస్టర్ సినిమాలో నటించారు. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం డిజాస్టర్ అయ్యింది. ఆ సినిమా సమయంలో అయిన పరిచయం ఇద్దరి మధ్య ప్రేమకి దారితీసిందని టాక్. అప్పటి నుంచి వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి రిలేషన్ లో ఉన్నారనే ప్రచారం ఉంది.

అయితే దీనిపై వారు ఎప్పుడు కూడా స్పందించి ఖండించిన దాఖలాలు లేవు. ఇక త్వరలో పెళ్లి పీటలు ఎక్కడానికి రెడీ అవుతున్న ఈ ఇద్దరి ఎంగేజ్మెంట్ జూన్ నెలలో కుటుంబ సభ్యుల సమక్షంలో జరగనుంది అనే పింక్ విల్లా రాసింది. ఇదిలా ఉంటే ఇదే అంశంపై డెడ్ ఫిక్సల్స్ ప్రమోషన్స్ లో నిహారికని మీడియా ప్రశ్నించింది.

అయితే ఆ టాపిక్ పై తాను ఏమీ మాట్లాడాలని అనుకోవడం లేదని, ప్రస్తుతం తన వెబ్ సిరీస్ గురించి మాత్రమే మాట్లాడుతా అని స్కిప్ చేసింది. దీంతో ఆ వార్తలకి బలం చేకూరినట్లు అయ్యింది. మరి ఈ పెళ్లి వార్తలపై మెగా ఫ్యామిలీ నుంచి గాని లేదంటే వరుణ్, లావణ్య త్రిపాఠి నుంచి ఏమైనా క్లారిటీ వస్తుందా అనేది చూడాలి.