టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది ప్రముఖులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. కొందరు త్వరగానే కోలుకున్న మరికొందరి పరిస్థితి విషమంగా మారి తిరిగిరాని లోకాలకు వెళ్లారు. దాదాపు ఏడాది పాటు అందరిని వణికించిన కరోనా మహమ్మారి ఇప్పుడిప్పుడే శాంతిస్తుంది. కొత్త రకం కరోనా పుట్టినప్పటికీ, దాని ఎఫెక్ట్ పెద్దగా లేదని తెలుస్తుంది. అయితే కొద్ది రోజుల క్రితం మెగా ఫ్యామిలీలో కరోనా గుబులు పుట్టించింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన ఇంట్లో జరిగిన క్రిస్మస్ వేడుకలకు మెగా ఫ్యామిలీ హీరోలతో పాటు వారి కుటుంబాలని ఆహ్వానించాడు. చిరంజీవి, పవన్, నాగబాబు తప్ప దాదాపు అందరు హాజరయ్యారు.
డిసెంబర్ 24న జరిగిన పార్టీలో అందరు కలిసి రచ్చ రంబోలా చేశారు. ఇది జరిగిన నాలుగు రోజులకు రామ్ చరణ్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. ఆయన ప్రకటించిన కొద్ది గంటలలోనే వరుణ్ తేజ్‌కు కూడా కరోనా బారిన పడ్డట్టు రిపోర్ట్స్ వచ్చాయి. దీంతో క్రిస్మస్ పార్టీకి హాజరైన వాళ్లందరి గుండెలలో గుబులు రేగింది. ఒకరి తర్వాత ఒకరు ఆసుపత్రికి వెళ్లి కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అదృష్టవశాత్తు అందరికి కరోనా నెగెటివ్ అని రిపోర్ట్స్ వచ్చాయి. అయితే ఉపాసనకు నెగెటివ్ రిపోర్ట్ వచ్చినప్పటికీ, లక్షణాలు కనిపిస్తుండడంతో క్వారంటైన్‌కు వెళ్ళింది.
కరోనా పాజిటివ్ అని తెలిసిన వెంటనే క్వారంటైన్‌కు వెళ్లిన వరుణ్ తేజ్ వైద్యుల సలహాలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ రోజు జరిపిన పరీక్షలో వరుణ్ తేజ్‌కు నెగెటివ్ రావడంతో ఆ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా కాస్త ఫన్నీగా తెలియజేశారు. ఓ నెగిటివ్ రిపోర్ట్ రావడం నాకు ఇంత ఆనందం ఇస్తుందని అనుకోలేదు” అని ఫైనల్ గా తనకి కోవిడ్ నెగిటివ్ రిపోర్ట్ వచ్చినట్టుగా కన్ఫర్మ్ చేశారు. వరుణ్ తేజ్ సినిమాల విషయానికి వస్తే ఎఫ్ 3 చిత్రంతో పాటు బాక్సర్ అనే చిత్రాలు చేస్తున్నాడు. ఈ రెండు చిత్రాలపై అభిమానులలో భారీ అంచనాలు ఉన్నాయి.
— Varun Tej Konidela 🥊 (@IAmVarunTej) January 7, 2021