టాలీవుడ్‌లో వేసవి సీజన్ అనగానే బిగ్ సినిమాల పండుగనే చెప్పాలి. భారీ అంచనాల మధ్య విడుదలయ్యే చిత్రాలు ప్రేక్షకులను థియేటర్ల వైపు రప్పించేందుకు పోటీ పడతాయి. అయితే ఈ ఏడాది సమ్మర్ బాక్సాఫీస్ రేసులో ఊహించని మార్పులు చోటుచేసుకున్నాయి. మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’, ప్రభాస్ ‘రాజా సాబ్’ వంటి భారీ సినిమాలు వాయిదా పడటం మిడ్రేంజ్ హీరోల చిత్రాలకు అదనపు లబ్ధి కలిగించింది. ఫలితంగా మిడ్రేంజ్ సినిమాల మధ్యే హీట్ పెరిగే అవకాశం కనిపిస్తోంది.
మార్చి 14న కిరణ్ అబ్బవరం ‘దిల్ రూబా’ అలాగే నాని బ్యానర్‌లో ప్రియదర్శి నటించిన ‘కోర్ట్’ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. అదే నెల 28న నితిన్ ‘రాబిన్ హుడ్’, సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ‘మ్యాడ్ స్క్వేర్’ విడుదల కానున్నాయి. ఈ రెండు సినిమాలు కమర్షియల్ వర్కౌట్ అయితే వేసవి రేసులో ముందుకు వెళ్లే అవకాశం ఉంది. మరోవైపు తమిళ హీరో విక్రమ్ ‘వీర ధీర శూరన్ పార్ట్ 2’, మలయాళ మల్టీ బడ్జెట్ మూవీ ‘ఎల్ 2: ఎంపురాన్’ కూడా ప్రేక్షకుల్ని ఆకర్షించనున్నాయి. బాలీవుడ్ నుంచి సల్మాన్ ఖాన్, రష్మిక మండన్నా నటించిన ‘సికిందర్’ కూడా మార్చి 30న విడుదల కాబోతుంది.
ఏప్రిల్‌లోనూ పోటీ తీవ్రంగా ఉంటుంది. బెల్లంకొండ శ్రీనివాస్ ‘భైరవం’ ఏప్రిల్ 4న విడుదలవుతుండగా, 10న సిద్ధు జొన్నలగడ్డ ‘జాక్’, అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’, సన్నీ డియోల్ ‘జాట్’ సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. ఏప్రిల్ 25న మంచు విష్ణు ‘కన్నప్ప’ విడుదల కానుండటంతో ఈ సీజన్ మరింత ఆసక్తికరంగా మారింది. ఇక మే నెలలో అసలు హీట్ పెరగనుంది. మే 1న నాని ‘హిట్ 3 – ది థర్డ్ కేస్’ రిలీజ్ కానుండగా, మే 9న పవన్ కళ్యాణ్ ‘హరి హర వీర మల్లు’ థియేటర్లలోకి రానుంది. అదే రోజున నితిన్ ‘తమ్ముడు’ కూడా విడుదల కావాల్సి ఉండగా, పవన్ సినిమా రిలీజ్ ఖరారైతే వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ వేసవిలో పెద్ద సినిమాల వాయిదా నేపథ్యంలో మిడ్రేంజ్ సినిమాలకు మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మే 9, మే 30 తేదీల్లో భారీ సినిమాలు బరిలోకి దిగుతుండటంతో ఆ రెండు డేట్స్ బాక్సాఫీస్‌ను షేక్ చేసే అవకాశముంది. మరి ఈ వేసవిలో ఏ సినిమా గెలుస్తుందో, ప్రేక్షకులను ఎక్కువగా థియేటర్లకు రప్పించేదేమిటో చూడాలి.