ఫ‌లించిన ప్రార్ధ‌న‌లు.. ఆసుప‌త్రి నుండి డిశ్చార్జ్ అయిన రాజ‌శేఖ‌ర్

టాలీవుడ్ సీనియ‌ర్ హీరో రాజ‌శేఖ‌ర్ గ‌త కొద్ది రోజులుగా క‌రోనాతో బాధ‌ప‌డుతూ హైద‌రాబాద్‌లోని సినీ న్యూరో సెంట‌ర్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న సంగ‌తి తెలిసిందే. త‌మ అభిమాన హీరో త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఫ్యాన్స్ , మా స్నేహితుడు క‌రోనా నుండి బ‌య‌ట‌ప‌డి క్షేమంగా ఆసుప‌త్రి నుండి తిరిగి రావాల‌ని చిరంజీవి వంటి ప‌లువురు ప్ర‌ముఖులు ప్రార్ద‌న‌లు చేశారు. అంద‌రి ప్రార్ధ‌న‌లు ఆల‌కించిన భ‌గ‌వంతుడు రాజ‌శేఖ‌ర్‌ని కాపాడాడు. క‌రోనాని జ‌యించి క్షేమంగా ఇంటికి చేరారు.

రాజశేఖ‌ర్‌కు క‌రోనా నెగెటివ్ రావ‌డంతో కొద్ది సేప‌టి క్రితం ఆసుప‌త్రి నుండి డిశ్చార్జ్ చేశారు. ఆసుప‌త్రి నుండి డిశ్చార్జ్ అయ్యే స‌మయంలో జీవిత త‌న భ‌ర్త‌తో క‌లిసి ఫొటో దిగ‌గా, ఆ పిక్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. అయితే తమ కోసం ప్రార్ధించిన ప్రతి ఒక్కరికి అలాగే వైద్యం అందించిన సిబ్బందికి రాజ‌శేఖ‌ర్‌తో పాటు ఆయ‌న స‌తీమ‌ణి ధన్యవాదాలు తెలిపారు. కాగా, జీవిత ఆమె ఇద్ద‌రు కూతుళ్ల‌కు కూడా క‌రోనా సోక‌గా, వారు త్వ‌ర‌గానే కోలుకున్నారు. రాజ‌శేఖ‌ర్‌కు ప‌లు అనారోగ్య స‌మస్యలు ఉండ‌డం వ‌ల‌న కోలుకోవ‌డానికి ఇంత స‌మ‌యం ప‌ట్టింది. గ‌రుడ వేగ చిత్రంతో రీఎంట్రీ రాజ‌శేఖ‌ర్ ప్ర‌స్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్ చేసే ఆలోచ‌న‌లో ఉన్నారు.

రాజ‌శేఖ‌ర్ ప‌రిస్తితి చేయిదాటిపోతుందేమోన‌ని భ‌య‌ప‌డిన సంద‌ర్భంలో ఆయ‌న క‌రోనాని జ‌యించ‌డం అంద‌రిలో ఆనందం క‌లిగిస్తుంది. కొన్ని రోజులుగా ఐసీయూలో ఉంటూ వ‌చ్చిన రాజ‌శేఖ‌ర్ ఈ రోజు డిశ్చార్జ్ కావ‌డంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. కుటుంబం కూడా చాలా సంతోషించింది. తన ఆరోగ్యం కోసం శ్రమించిన వైద్యులకు, నర్సులకు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపాడు రాజ‌శేఖ‌ర్. సిటీ న్యూరో సెంటర్ తమకు చాలా సాయపడిందని జీవిత తెలిపింది. వాళ్లే లేకపోయుంటే ఈ రోజు తమకు చాలా ఇబ్బందులు వచ్చేవని చెప్పింది జీవిత. రాజశేఖర్ ప్రాణాలు కాపాడిన వైద్యులకు ఆమె మనస్పూర్థిగా కృతజ్ఞతలు తెలిపింది. ఇక రాజ‌శేఖ‌ర్ డిశ్చార్జ్ అయ్యే ముందు సిటీ న్యూర్ సెంటర్ హాస్పిటల్ సిబ్బందితో క‌లిసి ఫోటోలు దిగారు