బిగ్‌బాస్‌.! ఆ ఎపిసోడ్ కోసం న్యూ గెస్ట్ హోస్ట్.! నిజమేనా.?

బిగ్‌బాస్ హంగామా స్టార్ట్ కాబోతోంది అతి త్వరలోనే. సెప్టెంబర్‌లో బిగ్‌బాస్ ఏడో సీజన్‌కి శ్రీకారం చుట్టబోతున్నారు స్టార్ మా నుంచి బిగ్‌బాస్ టీమ్. తిట్టుకున్నా.. ఛీ కొట్టినా సరే, బిగ్‌బాస్‌కి అడిక్ట్ అయిపోయే ఆడియన్స్‌లో ఈ సారి సీజన్‌పై తీవ్రమైన అసహనం నెలకొంది.

ముఖ్యంగా హోస్ట్ నాగార్జునని ఆడియన్స్ అస్సలు స్వాగతించలేకపోతున్నారు. మొదటి రెండు సీజన్లను ఎన్టీయార్, నాని సమర్ధవంతంగా నడిపించారు. ఆ రెండు సీజన్లకూ మంచి ఆదరణ కూడా దక్కింది.

బిగ్‌బాస్ గేమ్‌ షోకి తెలుగులో మంచి బజ్ క్రియేట్ అవ్వడానికి సాయపడిందది. అయితే, నాగార్జునకు మొదట్నుంచీ నెగిటివిటీనే వెంటాడుతోంది. సీజన్లు నడిచే కొద్దీ ఆ నెగిటివిటీ పెరుగుతూ వచ్చింది. ఇక ఇప్పుడు పీక్స్‌కి  చేరుకుంది.

అస్సలు నాగార్జున వద్దంటే వద్దంటున్నారు. ఆ నెగిటివిటీని తట్టుకుని నాగార్జున ఎలా నిలబడతాడో ఏమో కానీ, తాజా పరిణామాల నేపథ్యంలో బిగ్‌బాస్ టీమ్ ఓ నిర్ణయానికి వచ్చిందట.

వీకెండ్‌ శని ఆదివారాల్లో మాత్రమే కనిపించే నాగార్జున.. ఇక నుంచి వారాంతంలో కేవలం ఒక్కరోజే కనిపించబోతున్నాడనీ ప్రచారం జరుగుతోంది. మరో రోజు (ఎలిమినేషన్ డే)ని గెస్ట్ హోస్ట్‌తో రన్ చేయాలనుకుంటున్నారట. ఆ లిస్టులో రానా పేరుతో పాటూ, మరో యంగ్ హీరో పేరు కూడా వినిపిస్తోంది. చూడాలి మరి, ఈ గాసిప్‌లో నిజమెంతో.!