Sreekanth: పూరీ జగన్నాద్‌తో సినిమా ఆగిపోవడానికి అదే కారణం.. అడ్వాన్స్ ఇప్పటికీ నా దగ్గరే: శ్రీకాంత్

Sreekanth: తాను యాక్టింగ్‌ నేర్చుకోవడానికి వెళ్లినప్పటి నుంచి పూరీ జగన్నాధ్ అక్కడ ఇన్సిట్యూట్‌లో మంచి స్నేహితులుగా ఉండేవారమని నటుడు శ్రీకాంత్ అన్నారు. అలా స్నేహితులమైన తాము ఒకానొక సందర్భంలో తామిద్దరూ కలిసి సినిమా చేసేందుకు ఒకసారి ప్లాన్ జరిగిందని ఆయన చెప్పుకొచ్చారు. దానికి సంబంధించి తనకు అడ్వాన్స్ కూడా ఇచ్చారని ఆయన అన్నారు. అది వైష్ణో అకాడమీలోనే చేద్దామనుకున్నామన్న శ్రీకాంత్, కొన్ని కారణాల వల్ల చాలా లేట్ అయిందని ఆయన చెప్పారు. ఆ తర్వాతే పోకిరీ సినిమా రావడం, అది చాలా పెద్ద హిట్ కావడం, దాంతో ఆయన చాలా బిజీగా మారిపోయారని శ్రీకాంత్ తెలిపారు. ఎప్పుడైనా కలిస్తే ఈ అడ్వాన్స్ తీసుకోమని అంటే, ఉంచు పర్లేదు మళ్లీ ఎప్పటికైనా ఉపయోగపడుతుంది అంటారని ఆయన చెప్పారు.

ఇక కృష్ణ వంశీ విషయానికొస్తే మహాత్మ సినిమాకు ముందే తామిద్దరి కాంబినేషన్లో సినిమా చేద్దామనుకుంటున్నామని కొన్ని వార్తలొచ్చాయి గానీ, అవి నిజం కాదని, అంతకు ముందు అసలేం అనుకోలేదని శ్రీకాంత్ స్పష్టం చేశారు. వంశీ మామూలుగా ఎప్పుడూ కలుస్తూ ఉంటాడని, తాను షూటింగ్‌లో ఉన్నపుడు అప్పుడప్పుడూ అక్కడికి వచ్చేవాడని ఆయన తెలిపారు. అలా ఆయనతో క్లోజ్‌నెస్ పెరిగిందని ఆయన చెప్పారు. ఆ తర్వాత పర్టిక్యులర్‌గా చేద్దామనుకున్నాం గానీ, అవి సెట్ కాలేదని ఆయన అన్నారు. ఆ టైంలోనే చంద్రలేఖ సినిమాకు అడగడం, అందులో ఓ చిన్న క్యారెక్టర్ చేయడం జరిగిందని ఆయన చెప్పారు.

ఇదిలా ఉండగా ఖడ్గం సినిమా అనేది తనను ఫ్యామిలీ సినిమాల నుంచి పూర్తిగా తీసుకొచ్చిన మూవీ అని ఆయన అన్నారు. ఆ సినిమా అనేది తన కెరియర్‌కి చాలా ప్లస్‌ అయిందన్న శ్రీకాంత్, ఇప్పటికి ఆ సినిమా చూసినా కూడా చాలా బాగా అనిపిస్తుందని ఆయన అనందం వ్యక్తం చేశారు. చాలా మంది తనను ఇప్పటికీ అలాంటి మూవీస్ చేయమని అడుగుతూ ఉంటారని, వంశీ లాంటి వ్యక్తిని తీసుకురండి చేస్తానని తాను చెప్తూ ఉంటానని ఆయన సరదాగా చెప్పారు.