తెలుగులో ఇప్పుడు ఎక్కువగా పర భాషా చిత్రాలను రీమేక్ చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగు, తమిళం లో బ్లాక్ బస్టర్స్ గా నిలిచిన సినిమాల రైట్స్ కొని ఏ హీరోలకి సరిపోతుందో ఆ హీరో డేట్స్ లాక్ చేసుకొని సినిమా చుట్టేస్తున్నారు. ఇందులో ఎక్కువగా మెగా హీరోలే ఉన్నారు. అక్కినేని హీరోల సినిమాలన్ని స్ట్రైట్ సినిమాలే. నందమూరి హీరోలు స్ట్రైట్ సినిమాలు చేస్తున్నారు. ఇక సురేష్ ప్రొడక్షన్స్ లో కూడా ఎక్కువగా రీమేక్ సినిమాలే రూపొందుతున్నాయి.
ఇప్పటికే వెంకటేష్ కోలీవుడ్ సూపర్ హిట్ సినిమా అసురన్ రీమేక్ నారప్ప లో నటిస్తున్నాడు. ప్రియమణి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక మెగా హీరోలలో మెగాస్టార్, పవర్ స్టార్ రీమేక్ సినిమాలని చేస్తున్నారు. ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్న మెగాస్టార్ ఈ సినిమా తర్వాత రెండు రీమేక్ సినిమాలలో నటించబోతున్నారు. మలయాళ సూపర్ హిట్ లూసీఫర్ తో పాటు తమిళ హిట్ సినిమా వేదాళం రీమేక్ లో నటించబోతున్నారు.
ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా రీ ఎంట్రీ ఇస్తూ నటిస్తున్న వకీల్ సాబ్ బాలీవుడ్ ..కోలీవుడ్ లో సూపర్ హిట్టైన పింక్ సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతుంది. అలాగే మలయాళ సూపర్ హిట్ సినిమా అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ లో కూడా నటించబోతున్నాడు. ఈ సినిమాకి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. అలాగే రామ్ చరణ్ మలయాళ ‘డ్రైవింగ్ లైసెన్స్’ రీమేక్ రైట్స్ తీసుకున్నాడు. కొణిదెల ప్రొడక్షన్ పై రూపొందనున్న ఈ సినిమాలో చరణ్ నటించే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇక ‘ధృవ’ కి సీక్వెల్ గా మరో రీమేక్ లో చరణ్ నటిస్తాడన్న వార్తలు వస్తున్నాయి.
అల్లు అర్జున్ కూడా ఒక హిందీ సినిమా రీమేక్ రైట్స్ తీసుకున్నట్టు చెప్పుకుంటున్నారు. ఈ సినిమాలో తానే నటిస్తాడని సమాచారం. అలాగే సురేష్ బాబు ఒక కొరియన్ సినిమాని రీమేక్ చేయబోతున్నాడని ఇంతక ముందే వార్తలు వచ్చాయి. ఈ సినిమాలో నివేదా థామస్, రెజీనా కసాండ్ర కలిసి నటిస్తారన్న వార్తలు వచ్చాయి. కాని ఇంకా ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ న్యూస్ రావాల్సి ఉంది. ఇలా ఎక్కువగా టాలీవుడ్ లో రీమేక్ సినిమాలే తయారవుతుండటం తో ఇక్కడ రచయితలు లేరా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.