అప్పుడు వాళ్ళు నేను ఇండస్ట్రీ ఉండకూడదని కోరుకున్నారు: దుల్కర్ సల్మాన్

మలయాళీ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ గురించి ప్రస్తుతం పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మహానటి సినిమా ద్వారా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన దుల్కర్ సల్మాన్ ఆ సినిమాలో తన నటనతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఆ తర్వాత “కనులు కనులనుదోచాయంటే” వంటి వైవిధ్యమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి టాలివుడ్ లో హీరోగా మంచి గుర్తింపు పొందాడు. ఇక ఇటీవల సీతారామం సినిమాలో లెఫ్టినెంట్ రామ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా మొదటి షో నుండే మంచి హిట్ టాక్ సొంతం చేసుకుని దేశవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా నాట్ ఇండస్ట్రీలో కూడా ఈ సినిమా కాసుల వర్షం కురిపించి వందకోట్ల క్లబ్ లో చేరి రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు దుల్కర్ సల్మాన్ నటన పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ ” చుప్.. రివేంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్ ” అనే సినిమాలో నటిస్తున్నాడు. ఆర్.బాల్కీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 23వ తేదీన విడుదల కానుంది. రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్ త్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో విమర్శలు ఎదుర్కొంటున్న ఒక కళాకారుడి బాధను కళ్ళకు కట్టినట్లు చూపించనున్నారు.

ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో సినిమా ప్రమోషన్ పనులను ప్రారంభించారు. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా దుల్కర్ సల్మాన్ ఒక ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో దుల్కర్ తన జీవితంలో ఎదుర్కొన్న విమర్శల గురించి చెప్పుకొచ్చాడు. దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. తన కెరీర్ ప్రారంభంలో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నానని వెల్లడించాడు. కెరీర్ ప్రారంభంలో నాకు నటన రాదని, నేను ఇండస్ట్రీలో ఉండకూడదని ప్రేక్షకులు కోరుకుంటూ విమర్శలు చేశారు. ఆ సమయంలో ఇలాంటి విమర్శలు చూసి చాలా బాధపడేవాడిని అంటూ దుల్కర్ సల్మాన్ వెల్లడించాడు. ఇలా విమర్శలు ఎదుర్కొన్న దుల్కర్ సల్మాన్ ఇప్పుడు మలయాళం లోనే కాకుండా తెలుగులో కూడా స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు.