Rana Daggubati: నాలుగు గంటల పాటు రోడ్లపై తిప్పి రానాకు క్లాస్ పీకిన సూర్య … ఎందుకంటే?

Rana Daggubati: తమిళంతో పాటు తెలుగులో సినీ ఇండస్ట్రీలోనూ తనకంటూ ఓ క్రేజ్‌ను ఏర్పరచుకున్న నటుడు సూర్య. కరోనా కాలంలో విడుదలైన ఆకాశం నీ హద్దురా, జై భీమ్ లాంటి చిత్రాలు ఓటీటీల్లో రిలీజ్‌ అయ్యి ఆయన ఇమేజ్‌ను మరింత పెంచాయని చెప్పవచ్చు. సినిమాల ప‌రంగా క్రేజ్‌, మార్కెట్ ఉన్న కోలీవుడ్ హీరోలలో సూర్య ఒక‌రు.

కాగా ఈ స్టార్ హీరో తాజాగా న‌టించిన మూవీ ‘ఈటీ’. ఈ యాక్షన్ అండ్ థ్రిల్లర్‌ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమా మార్చి 10న పాన్ ఇండియా లెవ‌ల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సంద‌ర్భంగా ఈ చిత్రానికి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల జరగగా, ఈ కార్యక్రమానికి హీరో సూర్య, సత్యరాజ్, చిత్ర దర్శకుడు పాండిరాజ్ త‌దిత‌రులు పాల్గొన్నారు. వీరితో పాటు ప్రస్తుతం టాలీవుడ్‌లో ముందుకు దూసుకుపోతున్న మరో నటుడు రానా ద‌గ్గుబాటి కూడా పాల్గొని అభిమానులను అలరించారు. అయితే ఈ ఈవెంట్‌లో సూర్య వద్దని వారిస్తున్నా.. రానా స్టేజ్‌పైనే ఓ సీక్రెట్‌ను చెప్పేశారు.

తాను సూర్యగారికి ‘పితా మ‌గ‌న్‌ సినిమా నుంచే చాలా పెద్ద ఫ్యాన్‌ని అని, అప్పుడు ఆయ‌న పేరు కూడా నాకు స‌రిగా తెలియ‌దని రానా అన్నారు. తాను యాక్టర్ అయిన త‌ర్వాత ఒక సినిమాను ఎడిటింగ్ రూంలో సూర్య గారు చూశారన్న రానా, ఆ త‌ర్వాత న‌న్ను త‌న కారులో ఎక్కించుకుని నాలుగు గంట‌ల పాటు రోడ్లపై తిప్పుతూ బాబు నువ్వు చేసేది యాక్టింగ్ కాదు.. ఏదో తట్టి మేనేజ్ చేసేస్తున్నావ్ అంతే అని క్లాస్ పీకారని రానా తెలిపారు. అలా ఆరోజు ఆయ‌న అలా అనడం వల్లనే నేను ఈ రోజు మీ ముందుకు భ‌ళ్లాల‌దేవుడిగా, డానియ‌ల్ శేఖ‌ర్‌గా నిల‌బ‌డిగ‌లిగాను అని ఆయన స్పష్టం చేశారు.

ఈ విషయాన్ని రానా స్టేజ్‌పైన చెప్తున్నపుడు సూర్య చెప్పొద్దంటూ సూచనలు చేస్తున్నా.. వినకుండా రానా తాను చెప్పాలనుకున్న విషయాన్ని పూస గుచ్చినట్టు చెప్పి అందరినీ ఆకర్షించారు. చాలా రోజుల త‌ర్వాత సూర్య సినిమా థియేట‌ర్స్‌లో విడుద‌ల‌వుతుండగా.. ఈ సినిమాపై చిత్ర బృందంపై భారీ అంచనాలే పెట్టుకున్నట్టు సమాచారం.