చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ దందా ఏ విధంగా నడుస్తుందో అందరికి తెలిసిన రహస్యమే. పలుమార్లు ఈ వ్యవహారంలో పోలీసులు రంగ ప్రవేశం చేసి హడావిడి చేయటం తర్వాత కొన్ని రోజులకి నీరుగారిపోవటం జరుగుతుంది. ఇదేవిధంగా నాలుగేళ్ల క్రితం టాలీవుడ్ లో భారీ రేంజ్ డ్రగ్స్ మాఫియా బయటపడింది. చాలా మంది ప్రముఖ నటీ నటులు ఇందులో భాగమయ్యారన్న ఆరోపణలు కొన్నాళ్ళు హల్ చల్ చేశాయి. నార్కోటిక్స్ సంస్థ కొంతమందిని ఆఫీస్ కు పిలిచి విచారించింది. అయితే ఎక్సైజ్ అధికారులు సినీ ప్రముఖులకు క్లీన్‌చీట్ ఇచ్చి, కొందరు డ్రగ్స్ విక్రేతలపై ఛార్జిషీట్లు దాఖలు చేసి సరిపెట్టేశారు.
ఈ డ్రగ్స్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. విచారణలో భాగంగా రంగంలోకి దిగిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఈ నెల 31 నుంచి సెప్టెంబర్ 22 వరకు జరిగే విచారణకు హాజరు కావాలని పలువురు ఇండస్ట్రీ ప్రముఖులకు సమన్లు జారీ చేసింది. ఈ క్రమంలో మొదటగా టాప్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఆగస్టు 31 విచారణకు హాజరు కావాలని, ఆ తర్వాత వరుసగా ఛార్మి సెప్టెంబర్ 2, రకుల్ ప్రీత్ సింగ్ సెప్టెంబర్ 6, రాణా దగ్గుబాటి సెప్టెంబర్ 8, రవితేజ, శ్రీనివాస్ సెప్టెంబర్ 9, నవదీప్ సెప్టెంబర్ 13, ఎఫ్ క్లబ్ జీఎం సెప్టెంబర్ 13, ముమైత్ ఖాన్ సెప్టెంబర్ 15, తనీష్ సెప్టెంబర్ 17, నందు సెప్టెంబర్ 20, తరుణ్ సెప్టెంబర్ 22న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో టాలీవుడ్ చిత్త్ర పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. విచారణలో ఎలాంటి వాస్తవాలు బయటకొస్తాయోనని చెవులు కోరుకుంటున్నారని సమాచారం.