నాకు అదే పెద్ద విజయం : అల్లు అర్జున్‌

‘పుష్ప’, ‘పుష్ప 2’ సినిమాలతో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ పేరు ప్రపంచవ్యాప్తంగా మోత మోగిపోతుంది. ఆ సినిమాలు ఇచ్చిన సక్సెస్‌లు అలాంటివి మరి. కానీ ఈ సినిమాల కంటే కూడా తనకు అసలైన విజయం వేరే ఉందని తెలుపుతూ.. అల్లు అర్జున్‌ ఓ ట్వీట్‌ చేశారు. ఆ ట్వీట్‌ మ్యాటర్‌లోకి వెళితే.. ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నటించిన ‘పుష్ప 2 ది రూల్‌’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలై రూల్‌ చేస్తోంది. ‘పుష్ప’ చిత్రంతో తన సత్తా చాటిన అల్లు అర్జున్‌, ఇప్పుడు ‘పుష్ప 2’తో మరోసారి తన పవర్‌ని బాక్సాఫీస్‌కి పరిచయం చేస్తున్నారు.

అయితే ‘పుష్ప’, ‘పుష్ప2’లు ఎంతగొప్పగా విజయాలు సాధించినా కూడా.. అల్లు అర్జున్‌కు మాత్రం వాటికంటే కూడా పెద్ద విజయం ఒకటుంది. అదేంటని అనుకుంటున్నారా? ‘పుష్ప 2’ విడుదల వేళ తన కుమారుడు అల్లు అయాన్‌ రాసిన లేఖ. అవును.. ఈ లేఖని ట్విట్టర్‌ ఎక్స్‌లో షేర్‌ చేసిన అల్లు అర్జున్‌ ఇదే తను సాధించిన అతి పెద్ద విజయమని ప్రకటించారు. అల్లు అయాన్‌ తన స్వ హస్తాలతో ‘ఐయామ్‌ ప్రౌడ్‌ ఆఫ్‌ యు నాన్న’ అంటూ ఓ లేఖను రాశారు.

ఈ లేఖను ఎక్స్‌లో పోస్ట్‌ చేసిన అల్లు అర్జున్‌ ఎమోషనల్‌ అవుతూ.. ఈ లెటర్‌ తన హృదయాన్ని హత్తుకున్నట్లుగా పేర్కొన్నారు. ఇంతకీ ఈ లెటర్‌లో ఏముందంటే.. ‘‘మీ సక్సెస్‌ పట్ల నాకు ఎంత గర్వంగా ఉందో చెప్పేందుకు ఈ లెటర్‌ రాస్తున్నా నాన్న.. ఈరోజు నాకు చాలా ప్రత్యేకం.. ఎందుకంటే ప్రపంచంలోనే ఒక గొప్ప నటుడి సినిమా రిలీజ్‌ అవుతోంది. నాకు మిక్స్‌డ్‌ ఎమోషనల్‌ ఫీలింగ్స్‌ ఉన్నాయి. పుష్ప 2 సినిమా మాత్రమే కాదు.. సినిమా పట్ల నీకున్న నిబద్ధతని తెలియజేస్తుంది. నా జీవితంలో ఎప్పటికీ నువ్వే హీరో నాన్న. నీకున్న కోట్లాది మంది అభిమానుల్లో నేను ఒకడిని’’ అంటూ అల్లు అయాన్‌ ప్రస్తావించాడు.

చివరిగా పుష్ప అంటే ఫైర్‌ కాదు.. వైల్డ్‌ ఫైర్‌ అంటూ ఈ లెటర్‌లో పేర్కొన్నాడు. కొడుకు అల్లు అయాన్‌ చిన్న పిల్లాడు రాసిన లేఖ కాబట్టి ఏమైనా తప్పులు ఉంటే పెద్ద మనసుతో అర్థం చేసుకోండి అని అల్లు అర్జున్‌ పోస్ట్‌లో ప్రస్తావించాడు. ఈ లెటర్‌ చూసిన బన్ని అభిమానులు లైక్స్‌తో తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. కాగా, ఈ లేఖలోనే కాదు.. ఇటీవల జరిగిన ‘పుష్ప 2’ ప్రీ రిలీజ్‌ వేడుకలోనూ, అల్లు అర్జున్‌ అటెండ్‌ అయిన ‘అన్‌స్టాపబుల్‌ షో’లోనూ అల్లు అయాన్‌ స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ‘పుష్ప తగ్గేదేలే’ అంటూ యాక్షన్‌ చేసి ఫ్యాన్స్‌ను అలరించాడు.