అదే నాకు పెద్ద బహుమతి.. ఫ్యాన్స్ ని రిక్వెస్ట్ చేసిన కన్నడ స్టార్ యష్!

రాకింగ్ స్టార్ య‌ష్‌ ‘కెజియ‌ఫ్’ ఫ్రాంచైజీ చిత్రాల‌తో గ్లోబ‌ల్ రేంజ్ స్టార్ డ‌మ్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమాల తర్వాత ఆయన చేసే సినిమా కోసం అంతా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే తనని ఇంతడి వాడిని చేసిన అభిమానులపై యష్ ఎంతో కృతాజ్ఞతాభావంతో ఉంటారు. య‌ష్ ప్ర‌స్తుతం ‘టాక్సిక్‌: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్‌’ సినిమా చేస్తున్నారు. ఈ భారీ ప్ర‌తిష్టాత్మ‌కమైన ఎంట‌ర్‌టైన‌ర్‌ను కె.వి.ఎన్‌.ప్రొడ‌క్ష‌న్స్‌, మాన్‌స్ట‌ర్ మైండ్ క్రియేష‌న్స్ బ్యానర్స్‌పై గీతు మోహ‌న్‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో వెంక‌ట్ కె.నారాయ‌ణ‌, య‌ష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

రాకింగ్ స్టార్ యష్ తన అభిమానులకు నూతన సంవత్సరానికి ఒక రోజు ముందుగానే పుట్టినరోజు సందేశం ఇచ్చారు. నా గత పుట్టినరోజు వేడుకల్లో కటౌట్ నిలబెట్టే ప్రయత్నంలో ముగ్గురు అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. ఈసారి అలాంటి సంఘటనలకు తావులేకుండా చూసుకోండి. ఈసారి నా పుట్టినరోజు (జ.8) నాడు నేను ఊళ్ళో ఉండను అని అభిమానులకు తెలిపారు. సినిమా షూటింగ్ కారణంగా నా పుట్టినరోజున ఊళ్ళో ఉండను. నా పుట్టినరోజు వేడుకల్లో మీరు చూపించే అభిమానం బాధ్యతాయుతంగా ఉండాలని కోరుకుంటున్నాను.

కాబట్టి ఫ్లెక్సీలు, బ్యానర్లు వంటి ఆర్భాటాలు చేయకుండా, నా మనసుకు బాధ కలిగించే పనులు చేయకుండా, మీరు ఎక్కడున్నా మీ కుటుంబ సభ్యులు గర్వపడే పనులు చేయండి. మీరంతా సురక్షితంగా ఉండటం, అనుకున్న లక్ష్యాలని చేరుకోవటం, ఆనందంగా ఉండటమే మీరు నాకు ఇచ్చే పెద్ద బహుమతి. అంతకంటే పెద్ద పుట్టినరోజు కానుక నాకు ఇంకేమీ వద్దు. త్వరలోనే మీ అందరినీ కలుస్తాను. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ యష్’ అని రాస్తూ పోస్ట్ షేర్ చేశారు.

2024 జనవరి 8 పుట్టినరోజు సందర్భంగా బ్యానర్లు కడుతూ విద్యుత్ ఘాతానికి గురై ముగ్గురు అభిమానులు చనిపోగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి అయితే బాధిత కుటుంబాలని పరామర్శించిన యష్ వారి బాధ్యతను తీసుకుంటున్నట్లు చెప్పాడు. ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి నాకు పుట్టినరోజు అంటేనే భయం వేస్తుంది అంటూ మీడియా ముందు ఎమోషనల్ అయిపోయాడు యష్.