ఓటీటీలోకి సైలెంట్‌గా వచ్చిన ‘తంగలాన్‌’

విక్రమ్‌ హీరోగా, మాళవిక మోహనన్‌ హీరోయిన్‌గా పా. రంజిత్‌ తీసిన చిత్రం ‘తంగలాన్‌ . విక్రమ్‌ ఈ మూవీ కోసం ఎంతలా కష్టపడ్డాడో ఆ మేకోవర్‌ చూస్తేనే అర్థం అవుతుంది. విక్రమ్‌ పడే కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే రావట్లేదు. తంగలాన్‌ కోసం విక్రమ్‌ పడ్డ కష్టం కొండంత అయితే.. వచ్చిన సక్సెస్‌, గుర్తింపు గోరంత అన్నట్టుగా ఉంటుంది. తంగలాన్‌ సినిమాకు థియేటర్లో మంచి రెస్పాన్స్‌ అయితే దక్కింది. కానీ కలెక్షన్లు అంతగా రాలేదు. మరి ఓటీటీలోకి వచ్చిన తరువాత రెస్పాన్స్‌ ఎలా వస్తుందో అని అంతా అనుకున్నారు.

కానీ తంగలాన్‌ ఓటీటీ అప్డేట్‌ ఆలస్యం అవుతూ వచ్చింది. చాలా మంది ఇక ఆ విషయాన్ని పట్టించుకోవడం మానేశారు. కానీ సైలెంట్‌గా మేకర్లు ఈ మూవీని ఓటీటీలోకి వదిలేశారు. తంగలాన్‌ నెట్‌ ఫ్లిక్స్‌లోకి వచ్చేసిందని, స్ట్రీమింగ్‌ అవుతోందని మేకర్లు ప్రకటించారు. దాదాపు 17 వారాల తరువాత ఓటీటీలోకి మేకర్లు వదిలారు. ఇంత ఆలస్యం ఎందుకు అయిందని నెటిజన్లు అనుకుంటున్నారు. తంగలాన్‌ చిత్ర ప్రదర్శనను ఆపేయాలంటూ గతంలోనే మద్రాసు హై కోర్టులో పిల్‌ దాఖలు అయిన సంగతి తెలిసిందే.

ఓ మతాన్ని కించపర్చేలా ఉందని కేసు వేశారు. ఈ కేసు మూలంగా కొన్ని రోజులు ఆలస్యమైంది. ఆ తరువాత నిర్మాతలు, ఓటీటీ సంస్థకు ఉన్న బేరసారాలు, ఒప్పందాల కారణంగా ఆలస్యం జరిగిందని అంటున్నారు. మరి ఓటీటీలోకి వచ్చింది కాబట్టి.. తంగలాన్‌ మీద చర్చలు జరుగుతాయి. విక్రమ్‌ పర్ఫామెన్స్‌ గురించి మరొక్కసారి సోషల్‌ మీడియా మాట్లాడుకుంటుంది. తంగలాన్‌ మూవీతో పా రంజిత్‌, జీవీ ప్రకాష్‌ పేర్లు అయితే బాగానే వినిపించాయి. అవార్డు విన్నింగ్‌ సినిమా అంటూ అందరూ ఆ మధ్య మాట్లాడుకున్నారు. ఇక ఇప్పుడు విక్రమ్‌ మళ్లీ కొత్త కాన్సెప్ట్‌తో రాబోతోన్నాడు. వీర ధీర శూరన్‌ అంటూ రాబోతోన్నాడు. ఇప్పటికే ఈ మూవీ గ్లింప్స్‌, టీజర్‌ను వదిలి హైప్‌ పెంచేశారు. ఈ చిత్రం జనవరిలో ఆడియెన్స్‌ ముందుకు రానుందని ఇది వరకే ప్రకటించారు.