Thaman: దేనికైనా టైం రావాలి అంటారు కదా… అదే మరోసారి రుజువైంది మ్యూజిక్ డైరెక్టర్ తమన్ విషయంలో. కెరీర్ ప్రారంభంలో అంతగా అవకాశాలు రాక కొన్ని సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. అలాంటి పరిస్థతుల్లో మ్యూజిక్ డైరెక్టర్ గా మారి ప్రస్తుతం టాప్ వన్ లో నిలవడం అనేది నిజంగా గర్వించదగ్గ విషయం. అయితే ఒక్కోసారి ఎంత టాలెంట్ ఉన్నా, ఏ ఇండస్ట్రీలో ఐనా పైకి రావడం చాలా కష్టంగా మారుతుంది. అలాంటి క్లిష్ట పరిస్థితుల నుంచి బయటికి వచ్చి తానేంటో, తన ప్రతిభ ఏంటో ప్రపంచానికి పరిచయం చేశారు తమన్.
ఇటీవల విడుదలైన అఖండ సినిమా అంత గొప్ప విషయం సాధించడం వెనక తమన్ సంగీతం ఎంతో కీలకమైందని చెప్పవచ్చు. ఈ సినిమాలో ఆయన ఇచ్చిన మ్యూజిక్ కి అభిమానులంతా ఫిదా అయిపోయారు. తమన్ తన అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ప్రేక్షకులను కట్టి పడేశారు అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఇక ఆ తర్వాత వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా భీమ్లా నాయక్ కి సైతం అదరగొట్టే మ్యూజిక్ ను ఇచ్చి సూపర్ హిట్ కొట్టారు తమన్. దీంతో తమన్ సక్సెస్ రేట్ భారీగా పెరిగిందని తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, ఇండస్ట్రీకి వచ్చిన దాదాపు 14 ఏళ్ళ తర్వాత తమన్ కి తాను అనుకున్న స్థానం దక్కిందంటే నిజంగా చెప్పుకోదగిన విషయమే. టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ లలో ఒకరైన దేవీ శ్రీప్రసాద్ ని కూడా మించిపోయి సక్సెస్ తో పాటు, క్రేజ్ ను కూడా సంపాదించుకున్నారు తమన్. ఐతే ఈ పరిణామాల నేపథ్యంలో తమన్ ప్రస్తుతం తన రెమ్యూనరేషన్ కూడా పెంచినట్టు సమాచారం. మొన్నటి వరకూ ఈయన కూడా కొంత మొత్తంలో పారితోషకం తీసుకుంటున్నా .. తాజా హిట్స్ తో తన రూట్ మార్చినట్టు తెలుస్తోంది. పెద్ద సినిమాలకు రూ.2.5 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. కానీ మ్యూజిక్ డైరెక్టర్ కి వచ్చే రెమ్యునరేషన్ లో సౌండ్ ఇంజినీర్స్ కి, మ్యూజిక్ ప్లేయర్స్ కి, మిక్స్ ఇంజినీర్స్ కి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అలా చూసుకుంటే తమన్ కు వచ్చే పారితోషికం లో చాలా వరకు బయటకే వెల్తుందని తెలుస్తోంది. ఏదేమైనా ప్రస్తుతం తమన్ చేతిలో 15 సినిమాల వరకు ఉన్నాయంటే చెప్పుకోవాల్సిన విషయమే. అతను మ్యూజిక్ ఇచ్చిన సినిమాలు అగ్ర హీరోలవి కావడం కూడా తమన్ కి ఒక ప్లస్ పాయింట్ గా చెప్పవచ్చు.