బ్రో సాంగ్స్ విషయంలో తప్పు ఒప్పుకున్న తమన్

ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ మ్యూజిక్ గా తమన్ ఉన్నాడు. ఏడాదికి పదికి పైగా సినిమాలు తమన్ చేస్తూ ఉండటం విశేషం. అన్ని కూడా స్టార్ హీరోలతో ఉంటున్నాయి. ఇంత బిజీ షెడ్యూల్ లో కూడా తన బెస్ట్ వర్క్ ని అన్ని సినిమాలకి ఇస్తున్నారు. తాజాగా బ్రో మూవీ రిలీజ్ అయ్యింది. ఈ మూవీకి తమన్ సంగీతం అందించారు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ పరంగా అయితే బ్రో సినిమాకి బెస్ట్ అవుట్ ఫుట్ ఇచ్చారు.

ఓ విధంగా బ్రో సినిమాకి పాజిటివ్ టాక్ వస్తుందంటే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా ఒక కారణం అని చెప్పాలి. అయితే ఈ సినిమాలో సాంగ్స్ మాత్రం పెద్దగా ఆకట్టుకోలేదు. సాయి తేజ్, కేతికపై ఒక డ్యూయెట్ తో పాటు మై డియర్ మార్కండేయ అనే పబ్ సాంగ్ కూడా ఉంది. ఈ రెండు సాంగ్స్ పెద్దగా క్లిక్ కాలేదు. తాజాగా బ్రో మూవీ సక్సెస్ మీట్ లో తమన్ కూడా ఈ విషయాన్ని ఒప్పుకోవడం విశేషం.

సక్సెస్ మీట్ లో తమన్ మాట్లాడుతూ బ్రో మూవీ బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో తనకి చాలా ప్రశంసలు లభిస్తున్నాయని అన్నారు. ఈ సినిమాని కమర్షియల్ యాంగిల్ లో చూడలేకపోయానని, కేవలం పవన్ కళ్యాణ్ ని దేవుడిగా భావించి మ్యూజిక్ అందించానని చెప్పారు. ఈ కారణంగానే బ్యాగ్రౌండ్ స్కోర్ అద్భుతంగా వచ్చిందని అన్నారు.

అదే సమయంలో సాంగ్స్ పరంగా తాను బెస్ట్ అవుట్ ఫుట్ అయితే ఇవ్వలేకపోయానని ఒప్పుకున్నారు. తనకి వరుసగా పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేసే అవకాశం వస్తుందంటే దానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ కారణమని అన్నారు. వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో, ఓజీ సినిమాలకి సంగీతం అందించడం చాలా గొప్పగా అనిపిస్తుందని అన్నారు.

ఈ సందర్భంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ పై తమన్ ప్రశంసలు కురిపించారు. తాను బ్యాగ్రౌండ్ స్కోర్ బాగా ఇస్తానని తెలుసు కానీ తన గురించి అందరికి తెలిసింది మాత్రం బ్రో మూవీ ద్వారానే అని చెప్పుకొచ్చారు. మొత్తానికి బ్రో సినిమా సాంగ్స్ సరిగా ఇవ్వలేకపోయాననే విషయాన్ని సక్సెస్ మీట్ లో తమన్ ఒప్పుకోవడం నిజంగా విశేషమని చెప్పాలి.