చిరు ‘విశ్వంభర’లో బాలీవుడ్‌ స్టార్‌ కునాల్‌ కపూర్‌!

అగ్ర కథానాయకుడు చిరంజీవి ప్రధానపాత్రలో వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘విశ్వంభర’ తాజాగా మరో కొత్త సమాచారంతో అభిమానుల్లో జోష్‌ పెంచింది. ఇందులో ఓ బాలీవుడ్‌ నటుడు పవర్‌ఫుల్‌ పాత్రలో కనిపించనున్నట్లు తెలిపింది. బాలీవుడ్‌ నటుడు కునాల్‌ కపూర్‌ ’విశ్వంభర’ టీమ్‌లో జాయిన్‌ అయినట్లు తెలుపుతూ దర్శకుడు పోస్ట్‌ పెట్టారు. ఇందులో కునాల్‌ విలన్‌గా కనిపించనున్నారంటూ కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది.

తాజాగా ఈ హీరోపై పోస్ట్‌ పెట్టిన నిర్మాణ సంస్థ.. ఆయన ఏ పాత్రలో కనిపించనున్నారనే విషయాన్ని మాత్రం గోప్యంగా ఉంచింది. ఇందులో కునాల్‌ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని.. ఆయన విలన్‌ అని తెలిసే ట్విస్ట్‌ సినిమాకే హైలైట్‌ అని టాక్‌. ఇప్పటికే ఈ బీటౌన్‌ హీరోపై కొన్ని కీలకమైన సన్నివేశాలను కూడా చిత్రీకరించినట్లు సమాచారం. ప్రస్తుతం ‘విశ్వంభర’ షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో కునాల్‌ కూడా పాల్గొంటున్నారు. జులై చివరి నాటికి చిత్రీకరణ పూర్తి చేయాలనే లక్ష్యంతో శరవేగంగా షూట్‌ చేస్తున్నారు. ఈ సినిమాలో విజువల్‌ ఎఫెక్ట్స్‌కు ప్రాధాన్యం ఉన్న నేపథ్యంలో పోస్ట్‌ ప్రొడక్షన్‌పై చిత్రబృందం ప్రత్యేక దృష్టి పెట్టనుంది. రూ.200కోట్లతో సోషియో ఫాంటసీ ఫిల్మ్‌గా ‘విశ్వంభర’ రూపొందుతోంది. ఇప్పటి వరకు చూడని పాత్రలో చిరు కనిపించనున్నారు.

భారీ స్థాయిలో యాక్షన్‌ సీక్వెన్స్‌లు ఉండనున్నాయి. ఇక ఈ చిత్రంలో ఐదుగురు హీరోయిన్లు ఉండనున్నట్లు ఎప్పటి నుంచో టాక్‌ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌లో స్టార్‌ హీరోయిన్స్‌ త్రిష, ఆషికా అధికారికంగా జాయిన్‌ అయ్యారు. సురభి, ఇషా చావ్లా, విూనాక్షి చౌదరి పేర్లను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది.