Sukumar: ఓ మనిషి మీద ఇంత అభిమానం ఉంటుందా? ఫ్యాన్‌ ప్రేమకు ఫిదా అయిన సుకుమార్!

Sukumar: మామూలుగా హీరోలన్నా, హీరోయిన్‌లు అన్నా అతి అభిమానం ఉండడం సాధారణమే. ఆ తర్వాత కమెడియన్స్‌కు, అంతే కాకుండా రాజకీయ నాయకులకు కూడా ఫ్యాన్స్ ఉండడం సర్వసాధారణమైన విషయమే. కానీ అదే ఓ మ్యూజిక్ డైరెక్టర్‌పైన అభిమానం ఉంటే, అదే లెవల్లో ఓ స్క్రిప్ట్ రైటర్‌పైన అభిమానం ఉంటే.. అది చెప్పుకోదగిన విషయమే కదా. అలాంటి ఘటనే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సంఘటన.

ఇంతకీ ఎవరిపై ఆ అభిమానం, ఆ అభిమానాన్ని ఎలా వ్యక్తం చేశారు అనే విషయానికొస్తే. .. అతనే దర్శకుడు సుకుమార్. ఆయనంటే సువీక్షిత్‌ బొజ్జా అనే ఏ నవ హీరో ఎన్నో ఏళ్ల నుంచి తెగ ఇష్టమట. అంత ఇష్టమైన తన అభిమాన డైరెక్టర్‌కు తన స్టైల్‌లో ఆ ఇష్టాన్ని చూపించాలని నిశ్చయించుకున్నాడు సువీక్షిత్‌. అయితే ఇటీవల కాలంలో విడుదలై ప్రపంచవ్యాప్తంగా భారీ హిట్‌ను సాధించిన పుష్ప సినిమా అందరికీ తెలిసిందే. అంతటి గొప్ప విజయానికి కారణమైన సుకుమార్‌కు ఏ అభిమానీ చేయని ఓ గొప్ప కార్య చేసి అందరి హృదయాలను ఆకట్టుకున్నాడు.

ఇక వివరాల్లోకి వెళితే ‘దూరదర్శిని’ అనే సినిమాలో హీరోగా నటిస్తున్న సువీక్షిత్‌ తనసొంత గ్రామమైన కడప జిల్లాలోని బోరెడ్డిగారి పల్లి గ్రామంలో.. ఆయన సొంత వ్యవసాయ భూమి రెండున్నర ఎకరాలలో దర్శకుడు సుకుమార్‌ రూపం వచ్చేటట్లు వరి పంటతో సాగు చేశారు. దాదాపు 50 రోజుల వ్యయప్రయాసల తర్వాత సుకుమార్ దృశ్యం ఆవిష్కృతమైంది. ఇలా తన అభిమానాన్ని చాటుకున్న సువీక్షిత్‌ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. అంతే కాకుండా డ్రోన్‌ కెమెరాతో అందమైన చిత్రాలను తీయడంతో పాటు, సుకుమార్ పేరుపే తానే స్వయంగా ఓ పాటను కూడా సిద్ధం చేశాడట. సుకుమార్ చిత్రంతో పాటు పుష్ప 2 అని కూడా సాగు చేయడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ఈ సుందర దృశ్యాలను చూసి తెగ మురిసిపోతున్నట్టు టాక్. తాజాగా ఈ పాటను మరియు దీనికి సంబంధించిన వీడియోను వీక్షించిన సుకుమార్ తనకు నోట మాట రావడం లేదని… దీన్ని చూడగానే తన కళ్లల్లో నీళ్లు వచ్చాయని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఓ మనిషి మీద ఇంత అభిమానం ఉంటుందా?..’ అంటూ అందరి సమక్షంలో సువీక్షిత్‌ని సుకుమార్ అభినందించడంతో ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.