Sandeep Reddy Vanga: స్పిరిట్ ఆలస్యం: వంగా మళ్లీ కొత్త హీరోతోనా?

ప్రభాస్ చేతిలో ఉన్న ప్రాజెక్టుల లైనప్ చూస్తే.. ఏది మొదట ఫినిష్ అవుతుందనేది బిగ్ కన్ఫ్యూజన్. ‘రాజా సాబ్’, ‘ఫౌజీ’, ‘సలార్ 2’, ‘కల్కి 2’, ‘ప్రశాంత్ వర్మ మూవీ’, ‘స్పిరిట్’.. ఇలా వరుసగా సినిమాలు ప్రకటించుకున్నా, వాటిలో పనులు అనుకున్న సమయానికి పూర్తి అవుతున్నాయా? అనేది పెద్ద ప్రశ్నే. ముఖ్యంగా సందీప్ వంగా దర్శకత్వంలో తెరకెక్కాల్సిన ‘స్పిరిట్’ పైనే ఇప్పుడు ఎక్కువగా చర్చ సాగుతోంది.

ఈ సినిమా గతేడాది సెట్స్ పైకి వెళ్లాల్సి ఉండగా, ఇప్పటివరకు ఒక్క సీన్ షూటింగ్ కూడా జరగలేదట. వంగా మాత్రం పూర్తి కమిట్‌మెంట్‌తో రెడీగా ఉన్నప్పటికీ, ప్రభాస్‌ నుంచి ఖచ్చితమైన డేట్స్ రాకపోవడంతో ప్లాన్ బీపై ఆలోచిస్తున్నాడట. ఎందుకంటే, ఒక స్టార్ కోసం ఏడు నెలల షెడ్యూల్ ప్లాన్ చేసుకోవడం వంగా తరహా కాదు. ఆయనకు అప్పుడే మరో కథ సిద్ధంగా ఉందని, అవసరమైతే దానికే దారి మళ్లించవచ్చనే టాక్ వినిపిస్తోంది.

ఇక ప్రభాస్ విషయానికొస్తే, ‘రాజా సాబ్’ పూర్తవుతున్నంత వరకూ ఇతర ప్రాజెక్టులకు ఫుల్ డేట్స్ ఇవ్వడం కష్టమే. అటు ‘ఫౌజీ’లోనూ ఆలస్యం జరుగుతుండటంతో, వంగా టైమ్ వృథా చేయకుండా ముందే నిర్ణయం తీసుకునే అవకాశముందని ఫిల్మ్ సర్కిల్స్ చెబుతున్నాయి. వంగా స్టైల్‌కి తగ్గ మరో హీరో పేరు ఇప్పటికే రిసర్చ్‌లో ఉన్నట్టుగా సమాచారం. ఇక ‘స్పిరిట్’ అఫిషియల్ గా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ లేదు. వంగా-ప్రభాస్ కాంబో నిజంగా వర్కౌట్ అవుతుందా లేక వంగా ముందుగా మరో స్టార్‌తో సినిమా మొదలెడతాడా అనేది మరో రెండు నెలల్లో తేలే అవకాశం ఉంది.